'ఢిల్లీ ప్రజల ఓట్లకు ఎందుకు తక్కువ విలువ'
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన చిరకాల వాంఛను మరోసారి బయటపెట్టారు. చత్రసాల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన కేజ్రీవాల్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. మిగతా రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కోరారు. 'ఢిల్లీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల కంటే అధికారాలు ఎందుకు తక్కువ ఉన్నాయి?.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల ప్రజల ఓట్ల విలువ కంటే.. ఢిల్లీ ప్రజల ఓట్లకు ఎందుకు తక్కువ విలువ ఉంటుంది' అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రజలకు వారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది కానీ.. ఆ ప్రభుత్వానికి మాత్రం పరిమితులతో కూడిన అధికారాలు మాత్రమే ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పరిస్థితి 1935 భారత ప్రభుత్వ చట్టం తరహాలో ఉందని అన్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో కూడా ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించారు గానీ.. ఎన్నికైన వారికి మాత్రం ప్రభుత్వాన్ని నడిపే అధికారం ఇవ్వలేదని తెలిపారు.