ప్రపంచ ఎకానమీ రికవరీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక రికవరీకి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ తగిన సమాన స్థాయిలో వేగంగా జరగాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు నిచ్చారు. మహమ్మారిపై పోరాటంలో భారతదేశం అనుసరించిన విధానాలను ఆమె గుర్తుచేసుకుంటూ, దీర్ఘకాలిక దృష్టితో ఎకానమీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండోనేషియా నేతృత్వంలో జరిగిన జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మొదటి వర్చువల్ ప్యానల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు.
అంతర్జాతీయంగా చూస్తే మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ మేరకు ఉన్న అసమతౌల్యతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. జీ20 జాయింట్ ఫైనాన్స్, హెల్త్ టాస్క్ ఫోర్స్ కార్యాచరణ ఈ దిశలో పురోగమించలని అన్నారు.
ద్రవ్యోల్బణం, సరఫరాల సమస్యలు, కొత్త వేరియెంట్ల భయాలు వంటి అంశాలుసహా అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌కు సంబంధించి ఆర్థికమంత్రి పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారని ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనే దిశలో పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె ఉద్ఘాటించినట్లు ఆర్థికశాఖ ట్వీట్ తెలిపింది.
బహుళజాతి సంస్థల తోడ్పాలు అవసరం
భవిష్యత్తులో మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనడానికి బహుళజాతి సంస్థల పాత్ర ఎంతో ఉందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఇందుకు సంబంధించి బహుళజాతి సంస్థలు మరిన్ని నిధులను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మద్దతు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. మహమ్మారి సవాళ్లు భారత్‌కూ ఇబ్బందులను సృష్టించాయని అన్నారు.
ఆరోగ్య మౌలిక లక్ష్యాల దిశలో ఒక్క భారతదేశమే 29 బిలియన్ డాలర్లను కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. ‘‘బహుళజాతి బ్యాంకులు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు తమ నిధులను పెంచాలి. సవాళ్లు పరిష్కారం, సుస్థిర పరిస్థితులు నెలకొల్పడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతిపాదిస్తున్న 50 బిలియన్ డాలర్ల ట్రస్ట్ (ఆర్‌ఎస్‌టీ) మహమ్మారి సంక్షోభాలపై దృష్టి సారించాలా చర్యలు ఉండాలి’’ అని ఆమె అన్నారు. దేశాలకు దీర్ఘకాలికంగా తగిన ఫైనాన్షియల్ మద్దతు అందించడం ఆర్‌ఎస్‌టీ ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. నిధుల సమీకరణకు రోడ్‌మ్యాప్ ఇవ్వడంలో జీ20 నియమించిన కమిటీ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని పేర్కొన్న ఆమె, జఅధికారిక అభివృద్ధి సహాయం (ఓడీఏ)తో సహా ఇతర మార్గాలతో వనరుల సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన సామర్థ్యాన్ని మరింత విస్తరించాలని, వనరులను సమీకరించడంసహా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని అన్నారు. ‘‘ప్రపంచ ప్రజా సంక్షేమానికి మనమందరం పరస్పరం సహకరించవలసి ఉంటుందని తొలుత గుర్తించాలి. ప్రపంచ దేశాలు చేయి చేయి కలిపి నడవడం మన ముందు ఉన్న ఒక కీలక మార్గం’’ అని ఆమె సమావేశంలో పేర్కొన్నారు.