Gagan Narag
-
పతకాల సంఖ్య పెరుగుతుంది
ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఇది నా ప్రయాణంలోని ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందుంచింది. మొదటిసారి 2004లో ఏథెన్స్కు వెళ్లినప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన చిన్నా పిల్లాడిలా నేను కనిపించాను. నాలుగేళ్ల తర్వాత బీజింగ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఎయిర్ రైఫిల్ ఫైనల్ అవకాశం చేజారడంతో నా గుండె పగిలింది. 2012 లండన్‌లో కాంస్యం పతకం గెలవడం ఆ బాధను మరిచేలా చేస్తే 2016లో పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒక అభిమానిగా మొదలు పెట్టి ఆటగాడిగా, ఆపై పతక విజేతగా, ఇప్పుడు ఇతరులకు మార్గదర్శిగా ఈ క్రీడలో నాకు ఎదురైన అన్ని సవాళ్లను ఇష్టంగానే ఎదుర్కొన్నాను. ఎయిర్ రైఫిల్ షూటర్ ఎలవెనిల్ వలరివన్‌లోని ప్రతిభను తొలిసారి అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్‌లో నా అకాడమీ గన్ ఫర్ గ్లోరీ గుర్తించిన తర్వాత ఆమె వరల్డ్ నంబర్‌వన్‌గా మారే వరకు మార్గనిర్దేశనం వహించడం సంతోషంగా అనిపిస్తుంది. షూటింగ్ చాలా ఖరీదైన క్రీడ. ఇదే కారణంగా కొన్నిసార్లు అపార ప్రతిభ కూడా కనిపించకుండా మరుగున పడిపోతుంది. దాగి ఉన్న వజ్రాలను వెతికి ఆపై సానబెట్టి వారిని జాతీయ శిబిరం వరకు చేర్చడమే మా లక్ష్యం. ఈ క్రమంలో ఎంతో బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నాం. ప్రతిభ గలవారు దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, అన్ని అడ్డంకులను అధిగమించే విధంగా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నాం. అత్యుత్తమ ప్రతిభ దారి తప్పకుండా ఒక సరైన వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో మనం ఉన్నాం. ఈ క్రమంలో ఖేలో ఇండియా గేమ్స్, స్కాలర్షిప్లు, గుర్తింపు పొందిన అకాడమీలు కీలకంగా పని చేస్తున్నాయి. ప్రతిభ గల అథ్లెట్లు ముందుగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) స్కీమ్ డెవలప్మెంట్ గ్రూప్‌లో అవకాశం దక్కించుకొని ఆపై మెరుగైన ప్రదర్శనతో ‘టాప్స్’ కోర్ గ్రూప్‌లోకి వస్తారు. భారత్‌కు సంబంధించి టోక్యో ఒలింపిక్స్ ఇప్పటికే ప్రత్యేకంగా మారాయి. గతంతో పోలిస్తే ఎక్కువ క్రీడాంశాల్లో, ఎక్కువ మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. నాకు తెలిసి తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఎంతో మంది అండగా నిలవడమే ఇందుకు కారణం. గతంలోని సంఖ్యను అధిగమించేలా భారత్ ఈసారి ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించగలదని ఆశించడంలో తప్పు లేదు. క్రీడల్లో ఉండే అనిశ్చితి గురించి నాకు బాగా తెలుసు. అయితే మన ఆటగాళ్ల సన్నద్ధతకు అవసరమైన అన్ని రకాల అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం కాబట్టి వాటి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నా. -
స్ఫూర్తి...కీర్తీ!
ఒక పోటీలో ఒకే స్వర్ణం ఉంటుంది. అది విజేత గెలుచుకుంటాడు. అదే పోటీలో రజతం ఉంటుంది. అది కూడా ఒకటే.దాన్ని విజేతనే అనుసరించేవారికి ఇస్తారు. ఇక ఆ పోటీలో మిగిలిందొక్కటే... కాంస్యం విజేత, రన్నరప్ మిస్సయిన మూడో వ్యక్తి అది అందుకుంటాడు. పోటీలంటే అంతేనా... విజేతలంటే వీరేనా... కాదు... కచ్చితంగా కాదు! తుది పోటీకి కొందరే అర్హత సాధించొచ్చు. ముగ్గురే గెలవొచ్చు. కానీ... అందరువిజేతలవ్వొచ్చు... స్ఫూర్తితో! వేనోళ్ల స్తుతించవచ్చు. కీర్తితో! గెలిచేందుకు అడ్డదారులు (డ్రగ్స్) తొక్కిన వారికంటే ఓడినవాళ్లే గ్రేట్...గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించినవారంతా గ్రేటెస్ట్...పోరాడిఓడిన ప్రతిఒక్కరు ఎవరెస్ట్ అంతటోళ్లు. వీళ్లందరికీ స్ఫూర్తి ఉంది. వెలకట్టలేని కీర్తి దక్కుతుంది. కాబట్టి ప్రియమైన క్రీడాకారులందరూ గుర్తుంచుకోండి... పతకం కోసమే పందేలున్నా... ప్రతిష్ట కోసం పోటీపడుతున్నా... కడదాకా స్ఫూర్తితో సాగాలి... కీర్తి గడించాలి. ఆల్ ద బెస్ట్! గోల్డ్‌కోస్ట్: నిరీక్షణ ముగిసింది. మరికొన్ని గంటల్లో కామన్వెల్త్ దేశాల మధ్య క్రీడల పండగకు తెర లేవనుంది. 12 రోజుల ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు 23 క్రీడాంశాల్లో 275 స్వర్ణ పతకాల కోసం పోటీపడతారు. తొలి రోజు కేవలం ప్రారంభ వేడుకలు జరుగుతాయి. గురువారం నుంచి పోటీలు మొదలవుతాయి. భారత్ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం జరిగే ప్రారంభోత్సవంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నేతృత్వంలో భారత బృందం మార్చ్‌పాస్ట్ చేయనుంది. ఆస్ట్రేలియాదే హవా... దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు 20 సార్లు కామన్వెల్త్ గేమ్స్ జరగ్గా... 12 సార్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2014 గ్లాస్గో గేమ్స్‌లో మాత్రం ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌ను సంపాదించింది. ఆతిథ్య దేశం హోదాలో ఈసారి ఆస్ట్రేలియా మళ్లీ పతకాల పంట పండించే అవకాశముంది. ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్, కెనడా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఏమేరకు పోటీనిస్తాయో వేచి చూడాలి. దక్షిణాఫ్రికా స్విమ్మర్ లె క్లోస్పై దృష్టి... ఐదోసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియాలో ఈసారి అందరి దృష్టి దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాద్ లె క్లోస్పై ఉంది. వరుసగా మూడోసారి ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న అతను ఇప్పటికే 12 పతకాలు గెలిచాడు. మరో ఏడు పతకాలు సాధిస్తే కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టిస్తాడు. అత్యధిక పతకాలు నెగ్గిన రికార్డు షూటర్లు మిక్ గాల్ట్ (ఇంగ్లండ్), ఫిలిప్ ఆడమ్స్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఈ ఇద్దరూ 18 పతకాలు చొప్పున గెలిచారు. వేల్స్ చిన్నారి రికార్డు! టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్సె కొత్త చరిత్ర లిఖించనుంది. ఈ క్రీడల చరిత్రలో పాల్గొననున్న పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందనుంది. ‘పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడతాను. కేవలం వినోదం కోసం ఈ క్రీడల్లో పాల్గొంటున్నాననే వారికి సమాధానం ఇస్తాను’ అని అనా హర్సె తెలిపింది. మరోవైపు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన నెవెల్లె సొరెన్టినో 55 ఏళ్ల వయసులో కామన్వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఏడుగురు పిల్లల తండ్రి అయిన సొరెన్టినో పురుషుల స్క్వాష్ ఈవెంట్లో బరిలోకి దిగనున్నాడు. -
బుల్లెట్ దిగింది!
'ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా బుల్లెట్ దిగిందా, లేదా...' పోకిరి సినిమాలో హీరో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షూటర్లకు ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. బరిలోకి దిగింది మొదలు అదరగొడుతున్నారు. 'షూటింగ్'లో సత్తా చాటి పతకాల పంట పండించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ షూటర్లు దుమ్ము రేపారు. ఒక్క షూటింగ్ ఈవెంట్ లోనే అత్యధికంగా 17 పతకాలు సాధించిపెట్టారు. ఇందులో 4 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. మంగళవారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 35 పతకాలు చేరాయి. ఒకరిద్దరు మినహా షూటర్లు అందరూ సమిష్టిగా రాణించి అభిమానుల అంచనాలను నిలబెట్టారు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన హిమాచల్‌ప్రదేశ్ షూటర్ విజయ్ కుమార్ మాత్రం నిరాశపరిచాడు. ఫైనల్‌కు చేరుకోవడంలో ఫలమయ్యాడు. మనో షూటర్ రవి కుమార్ ఫైనల్లో తడబడ్డాడు. సీనియర్ షూటర్లుతో ఔత్సాహిక షూటర్లు పతకాలు సాధించడం ఈసారి విశేషం. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ అంచనాలకు తగినట్టు రాణించారు. నారంగ్(రజతం, కాంస్యం) రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళా షూటర్లు శ్రేయాసి సింగ్, అపూర్వి చండేలా, అయోనికా పాల్, మలైకా గోయల్ పతకాల పంట పండించారు. జీతూ రాయ్, గుర్పాల్ సింగ్, మహమ్మద్ అసబ్, ప్రకాశ్ నంజప్ప, లజ్జా గోస్వామి, మానవ్‌జిత్ సింగ్ సంధూ, సంజీవ్ రాజ్‌పుత్, హర్‌ప్రీత్ సింగ్ 'గురి' తప్పకుండా పతకాలు సాధించారు. భారత పతాకాన్ని అంతర్జాతీయ క్రీడా యవనికపై రెపరెపలాడించిన మన షూటర్లకు అభినందలు తెలుపుతూ.. మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.