ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఇది నా ప్రయాణంలోని ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందుంచింది. మొదటిసారి 2004లో ఏథెన్స్‌కు వెళ్లినప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన చిన్నా పిల్లాడిలా నేను కనిపించాను. నాలుగేళ్ల తర్వాత బీజింగ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఎయిర్ రైఫిల్ ఫైనల్ అవకాశం చేజారడంతో నా గుండె పగిలింది. 2012 లండన్‌లో కాంస్యం పతకం గెలవడం ఆ బాధను మరిచేలా చేస్తే 2016లో పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది.
ఒక అభిమానిగా మొదలు పెట్టి ఆటగాడిగా, ఆపై పతక విజేతగా, ఇప్పుడు ఇతరులకు మార్గదర్శిగా ఈ క్రీడలో నాకు ఎదురైన అన్ని సవాళ్లను ఇష్టంగానే ఎదుర్కొన్నాను. ఎయిర్ రైఫిల్ షూటర్ ఎలవెనిల్ వలరివన్‌లోని ప్రతిభను తొలిసారి అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్‌లో నా అకాడమీ గన్ ఫర్ గ్లోరీ గుర్తించిన తర్వాత ఆమె వరల్డ్ నంబర్‌వన్‌గా మారే వరకు మార్గనిర్దేశనం వహించడం సంతోషంగా అనిపిస్తుంది.
షూటింగ్ చాలా ఖరీదైన క్రీడ. ఇదే కారణంగా కొన్నిసార్లు అపార ప్రతిభ కూడా కనిపించకుండా మరుగున పడిపోతుంది. దాగి ఉన్న వజ్రాలను వెతికి ఆపై సానబెట్టి వారిని జాతీయ శిబిరం వరకు చేర్చడమే మా లక్ష్యం. ఈ క్రమంలో ఎంతో బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నాం. ప్రతిభ గలవారు దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, అన్ని అడ్డంకులను అధిగమించే విధంగా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నాం.
అత్యుత్తమ ప్రతిభ దారి తప్పకుండా ఒక సరైన వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో మనం ఉన్నాం. ఈ క్రమంలో ఖేలో ఇండియా గేమ్స్, స్కాలర్‌షిప్‌లు, గుర్తింపు పొందిన అకాడమీలు కీలకంగా పని చేస్తున్నాయి. ప్రతిభ గల అథ్లెట్లు ముందుగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) స్కీమ్ డెవలప్‌మెంట్ గ్రూప్‌లో అవకాశం దక్కించుకొని ఆపై మెరుగైన ప్రదర్శనతో ‘టాప్స్’ కోర్ గ్రూప్‌లోకి వస్తారు.
భారత్‌కు సంబంధించి టోక్యో ఒలింపిక్స్ ఇప్పటికే ప్రత్యేకంగా మారాయి. గతంతో పోలిస్తే ఎక్కువ క్రీడాంశాల్లో, ఎక్కువ మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. నాకు తెలిసి తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఎంతో మంది అండగా నిలవడమే ఇందుకు కారణం. గతంలోని సంఖ్యను అధిగమించేలా భారత్ ఈసారి ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించగలదని ఆశించడంలో తప్పు లేదు. క్రీడల్లో ఉండే అనిశ్చితి గురించి నాకు బాగా తెలుసు. అయితే మన ఆటగాళ్ల సన్నద్ధతకు అవసరమైన అన్ని రకాల అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం కాబట్టి వాటి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నా.
పతకాల సంఖ్య పెరుగుతుంది
Published Tue, Jul 20 2021 5:01 AM | Last Updated on Tue, Jul 20 2021 5:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment