ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు, అథ్లెట్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్-2024కు సర్వం సిద్దమైంది. జూలై 26న ప్యారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలకు తెరలేవనుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు.
బంగారు పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు ప్యారిస్‌కు పయనమయ్యారు. ఇక గత ఒలింపిక్స్‌లో తృటిలో పసిడి పతకాన్ని చేజార్చుకున్న భారత హకీ జట్టు.. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించి తమ 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. భారత హాకీ జట్టుపై ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ విశ్వక్రీడ్లలో భారత హాకీ జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. ఒలింపిక్స్‌లో ఏకంగా 8 బంగారు పతకాలు గెలుచుకున్న ఘనత భారత హాకీ టీమ్‌ది. ఇండియా హాకీ టీమ్ ఖాతాలో ఇప్పటివరకు 8 బంగారు పతకాలు, మూడు కాంస్య, ఒక రజత పతకం ఉన్నాయి. 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన తొట్టతొలి ఒలింపిక్స్‌లోనే పసిడి పతకం సాధించిన భారత హాకీ జట్టు.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.
1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో మొదలైన భారత స్వర్ణయాత్ర 1980 మాస్కో ఒలిపింక్స్ వరకు కొనసాగింది. ఆ మధ్యలో ఓ సిల్వర్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత హాకీ జట్టుకు అనూహ్యంగా గడ్డు కాలం ఎదురైంది. 1980 తర్వాత దాదాపు 41 ఏళ్ల పాటు హాకీలో భారత్ పతకం సాధించలేకపోయింది.
ఈ సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు.. తమ 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే టోక్యో ఒలిపింక్స్‌లో భారత్ కాంస్య పతకాన్ని ముద్దాడడంలో ఓ ఆటగాడిది కీలక పాత్ర.
ఆ మిడ్ ఫీల్డర్ అద్బుతమైన గోల్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చి బ్రాంజ్ మెడల్ నెగ్గేలా చేశాడు. కానీ అతడు మాత్రం ఓవర్ నైట్‌స్టార్‌గా మారలేకపోయాడు. ఇప్పటికి ఆ హాకీ ప్లేయర్ పేరు చాలా మందికి తెలియదు. అతడే భారత మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్.
సూపర్ గోల్.. సూపర్ విన్
2020 టోక్యో ఒలింపిక్స్ హాకీ క్వార్టర్-ఫైనల్‌లో భారత్, గ్రేట్ బ్రిటన్ తలపడ్డాయి. క్వార్టర్‌ఫైనల్‌లో భారత్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లో 7వ నిమిషంలో భారత్ మొదటి గోల్ చేయగా.. రెండో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే 16వ నిమిషంలో రెండో గోల్ చేసింది.
దీంతో సెకెండ్ క్వార్టర్ ముగిసే సరికి భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో క్వార్టర్ ఆఖరి నిమిషంలో బ్రిటన్ గోల్ సాధించి తిరిగి గేమ్‌లోకి వచ్చింది. దీంతో భారత డగౌట్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగో క్వార్టర్స్ ఆరంభం నుంచే స్కోర్‌ను సమం చేయడానికి బ్రిటన్ తీవ్రంగా శ్రమించింది.
దీంతో భారత ఆటగాళ్లు సైతం ఒత్తడిలోకి వెళ్లారు. బ్రిటన్‌ను గోల్‌లు చేయనివ్వకుండా భారత్ డిఫెన్స్ ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ ముగిసే సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఏ క్షణాన బ్రిటన్ గోల్ కొట్టి స్కోర్ సమం చేస్తుందోనని అంతా భయపడ్డారు.
సరిగ్గా ఇదే సమయంలో 57వ నిమషాన భారత మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ అద్భుతమైన గోల్ కొట్టి అందరిని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. దీంతో భారత్ 3-1 తేడాతో బ్రిటన్‌ను ఓడించి 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఇక టోక్యోలో భారత్‌కు కాంస్య పతకం అందించిన హార్దిక్ సింగ్.. ఇప్పుడు ప్యారిస్ వెళ్లిన హాకీ జట్టులోనూ సభ్యునిగా ఉన్నాడు. కాగా పంజాబ్‌కు చెందిన హార్దిక్ సింగ్.. 2018 నుంచి భారత హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment