న్యూఢిల్లీ: భారత హాకీ క్రీడాకారిణిలు తమకిష్టమైన అభిరుచులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ (2020) అర్హతే లక్ష్యంగా క్రీడాకారిణిలు తీసుకునే ఆహారంలో జట్టు సైంటిఫిక్ అడ్వైజర్ వేన్ లాంబర్డ్ కాస్త కఠినమైన ఆంక్షలు విధించారు. క్వాలిఫయింగ్ పోటీలు ముగిసేదాకా స్వీట్లు, మసాలా వంటకాలకు దూరంగా ఉండాలని లాంబర్డ్ సూచించారు. దీనిపై భారత హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న జట్టు మాది. ఫిట్‌నెస్‌పై లాంబర్డ్ చాలా శ్రద్ధ కనుబరుస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉండేందుకు కష్టపడుతున్నారు. మేమంతా ఆయన సూచించిన ఆహార నియమాల్ని పాటిస్తున్నాం కాబట్టే మాలో ప్రతి ఒక్కరు అసాధారణ ఫిట్‌నెస్‌తో ఉన్నారు. మేమిప్పుడు స్వీట్లు, చాక్‌లెట్లు, మసాలా, నూనె పదార్థాలు తినటం మానేశాం. ఆరోగ్యాన్ని, శారీరక సత్తా పెంచే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. మైదానంలో శ్రమించేందుకు అవసరమైన సమతుల, పోషకాహారాన్ని తీసుకుంటున్నాం’ అని చెప్పింది. రాణి సేన ఇటీవల జపాన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ సిరీస్‌లో టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో టోక్యో బెర్తుపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. నవంబర్‌లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలు జరుగునున్న నేపథ్యంలో క్రీడాకారిణిల డైట్‌పై ఈ విధమైన ఆంక్షలు విధించారు. భారత మహిళల జట్టు వచ్చే నెలలో టోక్యోలో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో తలపడనుంది. ఇందులో ఆతిథ్య దేశం జపాన్‌తో పాటు ఆస్ట్రేలియా తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment