ఢిల్లీలో హాకీ మ్యాచ్ ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదని.. దేశ రాజధానిలోని యువత హాకీ వైపు ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపేందుకు తమకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ హాకీ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది.
ప్యారిస్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 23, 24న ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారి ఢిల్లీ అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.
ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టు
ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశ రాజధానిలో.. చారిత్రాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఆడనుండటం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఎంతో ప్రత్యేకం కూడా! దేశ రాజధానిలో మరోసారి హాకీ స్ఫూర్తిని జ్వలింపచేసే అవకాశం రావడం.. ఆ జట్టుకు నేను సారథిగా ఉండటం నా అదృష్టం.
ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుగా ఉంది.వారితో పోటీ పడటం అంటే కఠిన సవాలుకు ఎదురీదడమే. అయితే, ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉంటే మాలోని అత్యుత్తమ ప్రదర్శన అంతగా బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత హాకీ జట్టు ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది
‘భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనున్నాం. ఇది ఆట ఉన్నతితో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ పేర్కొన్నాడు.
‘భారత్, జర్మనీ మధ్య హాకీ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది. జర్మనీ వంటి పటిష్ట జట్టుతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’ అని భోళానాథ్ సింగ్ అన్నాడు.
చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment