నేడు సెమీఫైనల్లో జర్మనీతో భారత్ ‘ఢీ’
రాత్రి గం. 10:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: ఒలింపిక్స్‌లో భారత హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌ను ‘షూటౌట్’లో ఓడించిన భారత్... మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన టీమిండియా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది.
1980కి ముందు ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలతో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన భారత్.. తిరిగి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం.. క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై అసమాన ప్రదర్శన కనబర్చింది. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడగా.. మిగిలిన 10 మందితోనే అద్భుతం చేసింది.
ఇక ‘షూటౌట్’లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలవడంతో 1972 తర్వాత భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అదే జోరులో జర్మనీని కూడా చిత్తుచేస్తే.. 44 ఏళ్ల తర్వాత టీమిండియా విశ్వక్రీడల తుదిపోరుకు అర్హత సాధించనుంది. చివరిసారి భారత జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న శ్రీజేశ్ మరోసారి కీలకం కానుండగా.. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో అతడు జర్మనీతో సెమీస్ పోరుకు అందుబాటులో లేడు.
అయితే ఇలాంటివి తమ చేతిలో లేవని... మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతామని ఈ టోరీ్నలో ఏడు గోల్స్ చేసిన భారత సారథి హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే పతకం దక్కించుకున్న టీమిండియా... మరోసారి జర్మనీని చిత్తు చేసి ముందంజ వేయాలని ఆశిద్దాం. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌తో స్పెయిన్ తలపడనుంది.
రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం
భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా.. రోహిదాస్ హాకీ స్టిక్ బ్రిటన్ ప్లేయర్ తలకు తగిలింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. మ్యాచ్ రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపి మైదానం నుంచి తప్పించాడు. దీనిపై భారత జట్టు అప్పీల్ చేయగా.. వాదనలు విన్న అనంతరం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అతడు నేడు జరిగే సెమీఫైనల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.‘నియమావళిని అతిక్రమించినందుకు అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించాం’అని ఎఫ్‌ఐహెచ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment