ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడల్లో అత్యుత్తమ, అతి పెద్ద మెగా ఈవెంట్. ఆటలంటే ఇష్టం ఉండే మన చిన్నారులందరూ టీవీల్లో ఒలింపిక్స్ పోటీలను చూస్తూనే ఉంటారు. ఇటీవల.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. స్పోర్ట్స్‌లోకి వచ్చిన వారందరికీ ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యం ఉంటుంది. ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత బాగా ఆడితేనే ఒలింపిక్స్ వరకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కర్ణాటకకు చెందిన ధీనిధి డేసింగు అనే అమ్మాయి కూడా అలాగే కలలు కన్నది. స్విమ్మర్ అయిన ఈ అమ్మాయి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు చాలా శ్రమించింది.
ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే ఈ క్వాలిఫికేషన్ సాధించడమే గొప్ప కాదు. దీంతో ఆమె మరో అరుదైన, ఆసక్తికరమైన ఘనతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో ఆడే సమయానికి ధీనిధి వయసు ఎంతో తెలుసా.. కేవలం పద్నాలుగేళ్లు. బెంగళూరులో ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ వయసు పిల్లలు అందరూ స్కూల్‌లో పాఠాలు చదవడంలో బిజీగా ఉంటే ధీనిధి ఏకంగా ఒలింపిక్స్‌లో పాల్గొని తన ప్రతిభను రుజువు చేసుకుంది. చిన్న వయసులోనే ఆటల్లో రాణించాలనుకునే అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచింది.
తల్లిదండ్రులు అండగా ఉండి..
ఒలింపిక్స్ వరకు చేరే క్రమంలో ధీనిధి తనను తాను మలచుకున్న తీరు చిన్నారులందరికీ ప్రేరణనిస్తుంది. ఆమెకు మూడేళ్లు వయసు వచ్చిన తర్వాత కూడా మాటలు రాలేదు. ఇంజినీర్లు అయిన తల్లిదండ్రులు శ్రీనివాసన్, జెసితలకు ఇది ఆందోళన కలిగించింది. డాక్టర్లను కలిసి చికిత్స అందించిన తర్వాత పరిస్థితి మెరుగైంది. అయితే వయసు పెరుగుతున్నా కొత్తవాళ్లతో కలవడంలో, వారితో మాట్లాడటంలో ధీనిధికి భయం పోలేదు. అందుకే అందరికీ దూరంగా, ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేది. తన చదువు తాను చదువుకోవడం మినహా ఇతర విషయాలను పట్టించుకోకపోయేది.
అయితే ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలనే ఉపాయాన్నీ వైద్యులే సూచించారు. చిన్న పిల్లలకు ఆటలంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఆటలో చేర్పిస్తే కలివిడితనం పెరిగే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. తల్లిదండ్రులిద్దరికీ బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. అయితే దానిని నేర్చుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ ఆలోచన మానుకొని తమ ఇంటి పక్కనే ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత నేర్చుకునేందుకు చేర్పించారు. ఆమె కొందరు స్నేహితులను సంపాదించుకుంటే చాలనేది మాత్రమే వారి ఆలోచన. అయితే తమ అమ్మాయి ఊహించినదానికంటే వేగంగా దూసుకుపోయి ఒలింపిక్స్ స్థాయి వరకు వెళుతుందని అప్పుడు వారికి తెలీదు.
తొలి గెలుపు తర్వాత...
తల్లిదండ్రులు స్విమింగ్‌లో చేర్పించినా.. అక్కడా ధీనిధి అంత ఇష్టం చూపించలేదు. ముందుగా నీళ్లంటే భయంతో పూల్‌లోకి దిగడానికే వెనుకాడింది. అయితే వాళ్లిద్దరూ అక్కడే ఉండి ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు తొలి అడుగు వేసింది. ఇలాంటి పిల్లలను తీర్చిదిద్దడంలో మంచి పేరున్న అక్కడి కోచ్ నెమ్మదిగా ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడంతో స్విమింగ్ అంటే భయం పోయింది. ఆ తర్వాత ఆ కోచ్ మరింత శిక్షణతో స్థానిక పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్కడే ఒక రేస్‌లో గెలవడంతో ఆ అమ్మాయికి కొత్త ఉత్సాహం వచ్చింది. పూల్‌లో మరిన్ని సంచలనాలకు సిద్ధమైంది.
వరుస విజయాలతో..
ఎనిమిదేళ్ల వయసులో ధీనిధి స్విమింగ్ నేర్చుకుని, తర్వాత ఆరేళ్లలోనే ఒలింపిక్స్ స్థాయికి ఎదగడం విశేషం. బెంగళూరులో ఎంతో పేరున్న డాల్ఫిన్ అక్వాటిక్స్‌లో చేరడంతో ఒక్కసారిగా ఆమె ఆటలో పదును పెరిగింది. అన్నింటికంటే ముందుగా కర్ణాటక మినీ ఒలింపిక్స్‌లో స్విమింగ్‌లో అందుబాటులో ఉన్న అన్ని పతకాలనూ గెలుచుకొని తన రాకను ఘనంగా చాటింది. ఆపై జాతీయ సబ్‌జూనియర్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పోటీల్లో 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పాల్గొన్న ఆమె ఇప్పటికీ దానినే తన ప్రధాన ఈవెంట్‌గా కొనసాగిస్తోంది.
ఆ తర్వాత జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో అందరి దృష్టీ పడగా.. 12 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ స్విమింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో ధీనిధి సత్తా అందరికీ తెలిసిపోయింది. గోవా జాతీయ క్రీడల్లో ఆమె ఏకంగా 7 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో కూడా పాల్గొని వరుసగా పతకాలు గెలుచుకుని, తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ స్థాయిని పెంచుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో...
జాతీయ స్థాయిలో టాప్ స్విమ్మర్‌గా ఎదిగిన ధీనిధి తర్వాత లక్ష్యం సహజంగానే అంతర్జాతీయ పోటీలకు మారింది. భారత టాప్ స్విమ్మర్‌గా 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది. 13 ఏళ్ల వయసులో భారత బృందంలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఒక మెగా ఈవెంట్‌లో తొలిసారి అడుగు పెట్టింది. ఆ తర్వాత దోహాలో జరిగిన వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇదే క్రమంలో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడంలో సఫలమైంది. ప్రపంచ అగ్రశ్రేణి స్విమ్మర్లతో పోలిస్తే పతకాల విషయంలో ధీనిధి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఈ అమ్మాయి ప్రదర్శన చూసిన తర్వాత.. ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభను కనబర్చడం అసాధారణమని, భవిష్యత్తులో అగ్రశ్రేణికి ఎదిగే నైపుణ్యం, తగినంత సమయం కూడా ఆమె వద్ద ఉందని అక్కడి విదేశీ కోచ్‌లు, నిపుణులు వ్యాఖ్యానించడం ధీనిధి బంగారు భవిష్యత్తు గురించి తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment