Gail officials
-
ఇద్దరు గెయిల్ అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్యాస్ పైపులైన్ పేలుడు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారులను సస్పెండ్ చేశారు. నగరం పేలుడు ఘటనలో ఇప్పటికి మొత్తం 19 మంది మృతి చెందారు. పచ్చటి గ్రామం మాడిపోయింది. కొబ్బరి చెట్లు నిట్టనిలువునా కాలిపోయాయి. గ్రామం స్మశానాన్ని తలపిస్తోంది. గ్యాస్ లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు ఏజీఎం స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు. మరొక అధికారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనకు సంబంధించి గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆధారంగా ఈ కేసులో మరికొన్ని సెక్షన్లను పొందుపరిచే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు
ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ సాక్షి, రాజమండ్రి: నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఐజీ సింగ్ రాజమండ్రి పోలీసు అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక అవసరమైతే సెక్షన్లు మారుస్తామన్నారు. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, ఓఎస్డీ రమాదేవి, డీఎస్పీలు నామగిరి బాబ్జీ, ఉమాపతివర్మ, మురళీకృష్ణ పాల్గొన్నారు.