ఇద్దరు గెయిల్ అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్యాస్ పైపులైన్ పేలుడు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారులను సస్పెండ్ చేశారు. నగరం పేలుడు ఘటనలో ఇప్పటికి మొత్తం 19 మంది మృతి చెందారు. పచ్చటి గ్రామం మాడిపోయింది. కొబ్బరి చెట్లు నిట్టనిలువునా కాలిపోయాయి. గ్రామం స్మశానాన్ని తలపిస్తోంది. గ్యాస్ లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు ఏజీఎం స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు. మరొక అధికారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా, నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనకు సంబంధించి గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆధారంగా ఈ కేసులో మరికొన్ని సెక్షన్లను పొందుపరిచే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.