Nagaram tragedy
-
'నగరం' ఘటనలు పునరావృతం కావొద్దు
-
'నగరం' ఘటనలు పునరావృతం కావొద్దు
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. నగరం గ్యాస్ పైప్ పేలుడు బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చినంత మాత్రానా సమస్యకు పరిష్కారం కాదని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జూన్ 27న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో 21 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. -
రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్‌లో మంటలు
తూర్పుగోదావరి జిల్లా గాడిమొగ రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల నగరంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నేపథ్యంలో అలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందోమోనన్న భయంతో జనం పరుగులు తీశారు. పరిశ్రమ చిమ్నీ నుంచి మంటలు ఎగిసిపడడంతో వాటిని చూసేందుకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అక్కడకు సమీపంలో ఉన్న గాడిమొగ, భైరవపాలెం, బాబానగర్, గోపాలపురం, లక్ష్మీపతిపురం, చినబొడ్డు, పెదబొడ్డు వెంకటాయపాలెం, యానాం సావిత్రినగర్, గిరియాంపేట, దరియాల తిప్ప, దొమ్మేటి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చేశారు. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అటు తాళ్లరేవు, ఇటు యానాం వరకు కూడా మంటల ప్రభావం కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్‌కు విషయం తెలియజేశారు. ఆమె రిలయన్స్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. పరిశ్రమలో సాంకేతిక కారణాల వల్లే మంటలు వచ్చాయని చెప్పినట్టు తెలిసింది. అరగంట వ్యవధిలోనే మంటలు అదుపులోకి రావడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. మంటల విషయాన్ని పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తెలిపారు. గ్యాస్ లీక్ కాలేదు: రిలయన్స్ పరిశ్రమలోని పవర్ యూనిట్ ట్రిప్ కావడంతో పైపులైన్లో ఉన్న గ్యాస్‌వల్ల మంటలు వచ్చాయే తప్ప ఎటువంటి గ్యాస్ లీకేజీ జరగలేదని రిలయన్స్ పీఆర్ఓ వెంకటరెడ్డి తెలిపారు. అధికంగా వచ్చిన మంటల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. -
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలపై జులై 11న అమలాపురంలో మేథావులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 20కి పెరిగింది. -
ఇద్దరు గెయిల్ అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్యాస్ పైపులైన్ పేలుడు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారులను సస్పెండ్ చేశారు. నగరం పేలుడు ఘటనలో ఇప్పటికి మొత్తం 19 మంది మృతి చెందారు. పచ్చటి గ్రామం మాడిపోయింది. కొబ్బరి చెట్లు నిట్టనిలువునా కాలిపోయాయి. గ్రామం స్మశానాన్ని తలపిస్తోంది. గ్యాస్ లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు ఏజీఎం స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు. మరొక అధికారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనకు సంబంధించి గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆధారంగా ఈ కేసులో మరికొన్ని సెక్షన్లను పొందుపరిచే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
నగరం ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడి మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి.. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పందొమ్మిదేళ్ల కాసు చిన్నా మృతి చెందారు. గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై, అధికారులుపై పలు కేసులు నమోదు చేశారు. మృతుల బంధువులకు 25 లక్షల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్రాలతోపాటు, గెయిల్ సంస్థ ప్రకటించింది. -
మా బతుకులు బూడిదయ్యాయి
అమలాపురం: గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో తమ బతుకులు బూడిదయ్యాయని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, అక్కడి బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. నగరం విషాద ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులు జరిగిన ఘటన తలచుకుంటే భయపడిపోతున్నారు. వణికిపోతున్నారు. ఓ బాధితురాలు మాట్లాడుతూ తమ కుటుంబంలో 11 మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో ఏడుగురు కాలిపోయినట్లు చెప్పారు. మరో మహిళ మాట్లాడుతూ నిద్రపోతున్న పిల్లలను బయటకు తీసుకువచ్చేసరికే మంటలు ఇంటిలోపలకు వచ్చేశాయన్నారు. తమ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు డాక్లర్ చెప్పారు. చికిత్స పొందుతున్నవారిలో అయిదుగురు ఆడవారు, ఇద్దరు మగవారు వున్నట్లు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్‌లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్
నగరం: గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని, గ్యాస్‌లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. గతంలో ఎన్నో జరిగాయని తెలిపారు. లీకేజీపై ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు చెప్పారన్నారు. గ్యాస్ లీకైనప్పడు అప్పటికప్పుడు కాస్త తవ్వి సిమెంట్ వేసి వదిలేస్తున్నారని తెలిపారు. గ్యాస్ లీకవుతుంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు. బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రంను అడిగి గ్యాస్‌లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చనక్కాయలు వేసినట్లుగా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జిసి, గెయిల్, చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు విదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవే ప్రామాణాలు ఇక్కడా పాటించాలన్నారు. యాజమాన్యాలకు భయం కలిగేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. గ్యాస్ పంపిణీ స్టేషన్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. నష్టపోయిన కొబ్బరి రైతాంగానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన చెట్లను కొట్టివేసి కొత్త మొక్కలను నాటడానికి, అవి ఇంత ఎత్తున పెరగడానికి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. అందుకు తగ్గ సహాయం రైతులకు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గెయిల్, ఓన్‌జీసీతోపాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించాలని కోరారు. అనంతరం జగన్ అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. -
గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్‌లో పేలిన దుర్ఘటనలో మరో వ్యక్తి మృతి చెందారు. దాంతో మృతులసంఖ్య 17కు చేరింది. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి 16 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ ఈ రోజు మృతి చెందారు. పైప్‌లైన్ పేలిన ఘటనలో కోనసీమలోని పచ్చని నగరం గ్రామం కాలిబూడిదైపోయింది. కొబ్బరి చెట్లు నిట్టనిలువునా తగలబడిపోయాయి. ఇళ్లన్నీ కాలిపోయి గ్రామం శ్మశానవాటికను తలపిస్తోంది.ఇంకా 29 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారి బాధ వర్ణనాతీతం. -
బాధితులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
నగరం: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్‌లో పేలిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అధికారులు, నేతలు ఆయనకు వివరించారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నిట్టనిలువునా తగలబడిపోయిన కొబ్బరి చెట్లను, ఇళ్లు కాలిపోయి శ్మశానవాటికను తలపిస్తున్న గ్రామాన్ని ఆయన పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన వెంట గ్రామానికి తరలి వచ్చారు. అంతకు ముందు ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను అందరిని కలుసుకొని పరామర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనను, వారుపడిన బాధలను వివరిస్తుంటే జగన్ చలించిపోయారు. ఒకే కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఆ కుటుంబాలు అన్నిటిని ఆయన కలుసుకుంటున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ బాధలు చెప్పుకున్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. -
నగరం చేరుకున్న వైఎస్ జగన్మోహన రెడ్డి
నగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం చేరుకున్నారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 16 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో జగన్ మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితులను, తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి, వారికి అందించే సహాయక చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, బాధితులు ఓఎన్జిసి, గెయిల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
నగరం దుర్ఘటన దిగ్బ్రాంతి కలిగించింది: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దుర్ఘటనలోని బాధితులందరికీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. త్వరతిగతిన బాధితులందరికి సహాయచర్యలు అందేలా చూస్తానని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలు కాగా, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.