నగరంలో గ్యాస్ పైప్ లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న వైఎస్ జగన్
నగరం: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్‌లో పేలిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అధికారులు, నేతలు ఆయనకు వివరించారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నిట్టనిలువునా తగలబడిపోయిన కొబ్బరి చెట్లను, ఇళ్లు కాలిపోయి శ్మశానవాటికను తలపిస్తున్న గ్రామాన్ని ఆయన పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన వెంట గ్రామానికి తరలి వచ్చారు.
అంతకు ముందు ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను అందరిని కలుసుకొని పరామర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనను, వారుపడిన బాధలను వివరిస్తుంటే జగన్ చలించిపోయారు. ఒకే కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఆ కుటుంబాలు అన్నిటిని ఆయన కలుసుకుంటున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ బాధలు చెప్పుకున్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.