రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్‌లో మంటలు
తూర్పుగోదావరి జిల్లా గాడిమొగ రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల నగరంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నేపథ్యంలో అలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందోమోనన్న భయంతో జనం పరుగులు తీశారు. పరిశ్రమ చిమ్నీ నుంచి మంటలు ఎగిసిపడడంతో వాటిని చూసేందుకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అక్కడకు సమీపంలో ఉన్న గాడిమొగ, భైరవపాలెం, బాబానగర్, గోపాలపురం, లక్ష్మీపతిపురం, చినబొడ్డు, పెదబొడ్డు వెంకటాయపాలెం, యానాం సావిత్రినగర్, గిరియాంపేట, దరియాల తిప్ప, దొమ్మేటి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చేశారు.
అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అటు తాళ్లరేవు, ఇటు యానాం వరకు కూడా మంటల ప్రభావం కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్‌కు విషయం తెలియజేశారు. ఆమె రిలయన్స్ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. పరిశ్రమలో సాంకేతిక కారణాల వల్లే మంటలు వచ్చాయని చెప్పినట్టు తెలిసింది. అరగంట వ్యవధిలోనే మంటలు అదుపులోకి రావడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. మంటల విషయాన్ని పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తెలిపారు.
గ్యాస్ లీక్ కాలేదు: రిలయన్స్
పరిశ్రమలోని పవర్ యూనిట్ ట్రిప్ కావడంతో పైపులైన్‌లో ఉన్న గ్యాస్‌వల్ల మంటలు వచ్చాయే తప్ప ఎటువంటి గ్యాస్ లీకేజీ జరగలేదని రిలయన్స్ పీఆర్‌ఓ వెంకటరెడ్డి తెలిపారు. అధికంగా వచ్చిన మంటల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు.