Relliance
-
రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్‌లో మంటలు
తూర్పుగోదావరి జిల్లా గాడిమొగ రిలయన్స్ ఆన్‌షోర్ టెర్మినల్ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల నగరంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నేపథ్యంలో అలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందోమోనన్న భయంతో జనం పరుగులు తీశారు. పరిశ్రమ చిమ్నీ నుంచి మంటలు ఎగిసిపడడంతో వాటిని చూసేందుకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అక్కడకు సమీపంలో ఉన్న గాడిమొగ, భైరవపాలెం, బాబానగర్, గోపాలపురం, లక్ష్మీపతిపురం, చినబొడ్డు, పెదబొడ్డు వెంకటాయపాలెం, యానాం సావిత్రినగర్, గిరియాంపేట, దరియాల తిప్ప, దొమ్మేటి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చేశారు. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అటు తాళ్లరేవు, ఇటు యానాం వరకు కూడా మంటల ప్రభావం కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్‌కు విషయం తెలియజేశారు. ఆమె రిలయన్స్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. పరిశ్రమలో సాంకేతిక కారణాల వల్లే మంటలు వచ్చాయని చెప్పినట్టు తెలిసింది. అరగంట వ్యవధిలోనే మంటలు అదుపులోకి రావడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. మంటల విషయాన్ని పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తెలిపారు. గ్యాస్ లీక్ కాలేదు: రిలయన్స్ పరిశ్రమలోని పవర్ యూనిట్ ట్రిప్ కావడంతో పైపులైన్లో ఉన్న గ్యాస్‌వల్ల మంటలు వచ్చాయే తప్ప ఎటువంటి గ్యాస్ లీకేజీ జరగలేదని రిలయన్స్ పీఆర్ఓ వెంకటరెడ్డి తెలిపారు. అధికంగా వచ్చిన మంటల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. -
స్వాన్ టెలికం కంపెనీయా.. అదేంటి: అనిల్ అంబానీ
అసలు స్వాన్ టెలికం కంపెనీ అనేది ఒకటుందని గానీ, దాని గురించి గానీ తనకు ఏమీ తెలియదని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు గురువారం వచ్చారు. 2008 సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం పొందిన స్వాన్ టెలికం కంపెనీ గురించి తెలుసా అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు ఆయనీ సమాధానం ఇచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ నేతృత్వంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. స్వాన్ టెలికం అనేది అనిల్ అంబానీ గ్రూపులోని బినామీ కంపెనీయే అన్నది ప్రాసిక్యూషన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీకి అసలు టెలికం స్పెక్ట్రం గానీ, లైసెన్సు గానీ పొందే అర్హత లేదని ప్రాసిక్యూషన్ వాదించగా, ఈ విషయాన్ని అంబానీ తరఫు డిఫెన్స్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అసలు ప్రాసిక్యూషన్ సాక్షులుగా అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలను పిలవడాన్ని రిలయన్స్ టెలికం కంపెనీ బుధవారం సవాలుచేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. గత నెలలో ఈ కేసులో అంబానీల విచారణను కోర్టు వాయిదా వేసింది. జూలై 19న అనిల్, టీనాలకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. దీంతో గురువారం కోర్టుకు వచ్చిన అనిల్ అంబానీ (54) చాలా ఉల్లాసంగా కనిపించారు. కోర్టు సమయం కంటే చాలా ముందుగానే వచ్చారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో సాక్షుల బోనులో నిలుచున్న ఆయన, తనకు స్వాన్ టెలికం గురించి తెలియదనే చెప్పారు. అయితే, టెలికం రంగంలో జరుగుతున్న మార్పుల విషయంలో చర్చించేందుకు పలుమార్లు టెలికం శాఖ మంత్రులు దివంగత ప్రమోద్ మహాజన్, ఎ.రాజా, కపిల్ సిబల్ తదితరులను పలుమార్లు కలిశానని చెప్పారు.