అసలు స్వాన్ టెలికం కంపెనీ అనేది ఒకటుందని గానీ, దాని గురించి గానీ తనకు ఏమీ తెలియదని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు గురువారం వచ్చారు. 2008 సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం పొందిన స్వాన్ టెలికం కంపెనీ గురించి తెలుసా అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు ఆయనీ సమాధానం ఇచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ నేతృత్వంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
స్వాన్ టెలికం అనేది అనిల్ అంబానీ గ్రూపులోని బినామీ కంపెనీయే అన్నది ప్రాసిక్యూషన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీకి అసలు టెలికం స్పెక్ట్రం గానీ, లైసెన్సు గానీ పొందే అర్హత లేదని ప్రాసిక్యూషన్ వాదించగా, ఈ విషయాన్ని అంబానీ తరఫు డిఫెన్స్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అసలు ప్రాసిక్యూషన్ సాక్షులుగా అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలను పిలవడాన్ని రిలయన్స్ టెలికం కంపెనీ బుధవారం సవాలుచేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. గత నెలలో ఈ కేసులో అంబానీల విచారణను కోర్టు వాయిదా వేసింది. జూలై 19న అనిల్, టీనాలకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి.
దీంతో గురువారం కోర్టుకు వచ్చిన అనిల్ అంబానీ (54) చాలా ఉల్లాసంగా కనిపించారు. కోర్టు సమయం కంటే చాలా ముందుగానే వచ్చారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో సాక్షుల బోనులో నిలుచున్న ఆయన, తనకు స్వాన్ టెలికం గురించి తెలియదనే చెప్పారు. అయితే, టెలికం రంగంలో జరుగుతున్న మార్పుల విషయంలో చర్చించేందుకు పలుమార్లు టెలికం శాఖ మంత్రులు దివంగత ప్రమోద్ మహాజన్, ఎ.రాజా, కపిల్ సిబల్ తదితరులను పలుమార్లు కలిశానని చెప్పారు.
స్వాన్ టెలికం కంపెనీయా.. అదేంటి: అనిల్ అంబానీ
Published Thu, Aug 22 2013 2:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement