గజరాజుపై గజాననుడు
కాణిపాకం(ఐరాల) : స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి స్వామి వారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భజన బృందాలు, కోలాట బృందాల ప్రదనలు ముందు సాగుతుండగా ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 8–30గంటల సమయంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సర్వాలంకృతులను చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేషాభరణాలతో అలంకరించి అలంకార మండపం వద్దకు వేంచేపు చేశారు. సంప్రదాయ పూజల అనంతరం ఉత్సవమూర్తులను గజవాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ మాడ వీధులు, కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ లు కేశవరావు, సూపరింటెం డెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చందనాలంకరణలో స్వామి వారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉభయదారుల అభిషేకం ముగిసిన అనంతరం స్వామివారి మూల విగ్రహనికి చందనాలంకరణ సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి చందనాలంకర ణలో దర్శన మిచ్చారు.