వైభవంగా గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం
20న హైదరాబాద్‌లో రిసెప్షన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, లక్ష్మి అరుణ దంపతుల కుమార్తె బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్‌దేవ్‌రెడ్డి, రమాదేవిల కుమారుడు రాజీవ్‌రెడ్డితో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరిగిన ఈ వేడుకలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మైదానంలోని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీవారి ఆలయ సెట్‌ను రూపొందించి.. అందులో శ్రీవారి నిలువెత్తు విగ్రహం ముందు బృహత్ వేదికను ఏర్పాటు చేశారు.
ఈ వేదికపై రాజీవ్‌రెడ్డి...బ్రహ్మణి మెడలో మాంగల్యధారణ గావించారు. కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మానందం, శరత్ రాంబాబు, పునీత్ రాజ్‌కుమార్, విశాల్ తదితర తెలుగు, కన్నడ, తమిళ చిత్రరంగాలకు చెందిన నటీనటులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కాపురామచంద్రారెడ్డి, భూమన కరణాకర్‌రెడ్డి తదితరులు నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మణి, రాజీవ్‌రెడ్డిల వివాహ విందు ఈ నెల 20న హైదరాబాద్‌లో జరగనుంది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)