గోదావరిలో దూకి యువకుడి గల్లంతు
కొవ్వూరు రూరల్ : కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై నుంచి ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని చిడిపి గ్రామానికి చెందిన 24 ఏళ్ల పామెర్ల సురేంద్ర సోమవారం రాత్రి మోటారు సైకిల్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు వెతకడం మొదలెట్టారు. ఈ క్రమంలో గామన్ వంతెనపై నుంచి మంగళవారం ఉదయం అతను మోటార్‌సైకిల్ ఉంచి గోదావరిలోకి దూకేశాడు. దీనిని అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి మోటార్‌సైకిల్ ముందు బ్యాగులో లభించిన విజిటింగ్ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సురేంద్ర బంధువులు వంతెనపైకి చేరుకుని ఆ మోటార్‌సైకిల్ అతనిదేనని గుర్తించారు. యువకుడి కోసం గోదావరిలో గాలింపు చేపట్టారు. సురేంద్ర ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. యువకుడి గల్లంతుతో చిడిపి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తహసీల్దార్ కె.విజయకుమార్, అగ్నిమాపక అధికారి సూర్యనారాయణ, ఎంపీడీవో ఎ.రాములు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.