మంచి నవలలో పంటి కింద రాళ్లు
విమర్శ
‘గమనమే గమ్యం’ మార్చ్ 2016లో ఓల్గా వెలువరించిన నాలుగు వందల పేజీల నవల. అట్ట మీద సముద్రమూ, ఇసుకా! సముద్రం మెత్తగా ఉండి, ఇసుక నిజంగా గరుగ్గానే ఉంది. ఈ స్పర్శానుభవం పాఠకుడి అనుభూతికి కొత్త సంగతిగా పరిచయం అవుతుంది.
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమార్తె, డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ(నవలలో పేరు శారదాంబ) (6.9.1906 జననం-మరణం నవల ప్రకారం 1965 భారత -చైనా యుద్ధం తర్వాత కాలంలో) జీవితంపై ఆధారపడ్డ రచన ఈ నవల. రాయడానికి ముఖ్య కారణం ఆమె ఆధునిక స్త్రీ, తెలుగు నాట తొలి లేడి డాక్టర్-సర్జన్, సాంఘిక రంగలో రాజకీయ కార్యాచరణ కలిగిన వ్యక్తి. 1957 ఎన్నికల్లో రెండవ లోక్సభకు విజయవాడ నుంచి ఎన్నికయిన సభ్యురాలు. ఇటువంటి ఎన్నో కారణాలు ఓల్గాను ఈ రచనకు పురికొల్పి ఉండవచ్చు. నవలలో 1910-1965 మధ్య గల కాలం చిత్రితమయ్యింది. బ్రాహ్మణ యువతి శారదాంబ, కమ్మ వనిత అన్నపూర్ణ, దేవదాసీల కుటుంబపు మహిళ విశాలాక్షి, ముగ్గురు స్త్రీలు స్వాతంత్య్ర పూర్వపు భారతదేశపు తెలుగు సమాజ భిన్న జీవన నేపథ్యాల వారు. తమ జీవితాలకు అభివృద్ధి అనుకున్నది వారు ఎలా సాధించారో, ఈ సాధించే క్రమాన్ని, ఈ కాలపు చరిత్రతో కలగలిపి చెప్పే క్లిష్ట ప్రయత్నం ఈ రచన.
కొమర్రాజు అచ్చమాంబ
నిజ జీవిత పాత్రలు కథలోకి వచ్చినప్పుడు, కాల్పనిక స్వేచ్ఛ తగ్గిపోతుంది. అచ్చమాంబ పేరు శారదాంబగా మార్చినా, ఆమె చుట్టుప్రక్కల గల సజీవ సమాజంలోని వారు, కందుకూరి వీరేశలింగం, ఆయన శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కాశీనాథుని నాగేశ్వర రావు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్ముఖ్, ముఖ్యంగా కొమర్రాజు లక్ష్మణరావు, చలసాని శ్రీనివాసరావు, ఇలా నిజమైన వ్యక్తులను కథనంలో పాత్రలు చేసేటప్పుడు నాలుగింతలు శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. సరి చూసుకోవలసిన తేదీలు, ఆయా తేదీలకు ఒదగ వలసిన చిత్రణలు, వ్యక్తుల జననాలు, మరణాలు, వీటికి చెందిన ప్రదేశాలు, అచ్చమాంబ జీవితంపై ప్రభావం చూపిన ఘట్టాలపై సమగ్ర చిత్రణ జరిగిందా అని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాల్సి వుంటుంది. కాని అలా జరిగినట్టు లేదు. ఇంత మంచి నవలలో, చరిత్రకు సంబంధించి పంటి కింద రాళ్లు తగలడం దురదృష్టకరం.
కందుకూరి వీరేశలింగం ఇంటికి, కొమర్రాజు రామారావు (కథలో కొమర్రాజు లక్ష్మణరావు పేరు), అప్పటికి కొద్ది కాలం కిందటే గతించిన తన అక్క పేరే పెట్టుకున్న తన అయిదేళ్ళ కూతురు శారదాంబను తీసుకువెళ్లడంతో కథ మొదలవుతుంది. రాజ్యలక్ష్మమ్మ, రాత్రి పాప నిద్రపోయే ముందు కథ చెప్పమంటే, పాత కథలు కాదు, కొత్త కథ, పాటలాంటిది చెప్తానని, ‘పూర్ణమ్మ’ వినిిపిస్తారు. రెండు రోజులు అక్కడ ఉన్నాక, ఈ తండ్రీకూతుళ్లు ఉన్నవ వారింటికి, గుంటూరు వెళ్తారు. రెండవ రోజునే, రాజ్యలక్ష్మమ్మ చనిపోయారన్న వార్త వస్తుంది కథలో. రాజ్యలక్ష్మమ్మ మరణం 11-8-1910న జరిగింది. అంటే ఓల్గా ఈ కథను ఆగస్టు మొదటి వారం, 1910లో ఆరంభించారన్న మాట. ఎక్కడైనా మొదలుపెట్టే స్వేచ్ఛ రచయితకు ఉన్నది. కాని గురజాడ ‘పూర్ణమ్మ’ గేయాన్ని 1912 వరకూ రాయలేదు. గేయం అచ్చులోకి 1929 వరకూ రాలేదు. 1910లో చనిపోయిన రాజ్యలక్ష్మమ్మ ఆ పాట పాడే అవకాశం లేదు.
వీరేశలింగం మృతి మద్రాసులో జరిగింది. అక్కడ మరి తక్కువ విషయాన్ని పొందు పరిచారు ఓల్గా. ఆయన ఎప్పుడు మద్రాసు వెళ్లినా ఉండేది కొమర్రాజు ఇంట్లోనే. వ్యావహారిక భాషను సమర్థిస్తూ తాను కూడా పని చేస్తానని గిడుగు రామమూర్తి పంతులుతో రాజమండ్రి సభల్లో అన్న మూడు నెలల్లోనే వీరేశలింగం, 27-5-1919న, మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు ఇంట్లో కన్నుమూశారు. ముందురోజు కూడా ‘కవుల చరిత్రలు’ ప్రూఫులు దిద్దుతూ గడిపారన్నది వారి చివరి దినాలను చూసిన వారు రాసిన, చెప్పిన భోగట్టా. అప్పటికి కుమార్తె పై తరగతి చదువులకై, మద్రాసుకు చేరుకున్న కొమర్రాజు కుటుంబం ఉండేది ఎగ్మూరులో. ఆ ఇంటి పేరు వేదవిలాస్, అని మద్రాసు ఆర్కైవ్స్ చెప్తున్నాయి. ఇవేవి ఓల్గా రచనలో కనిపించవు, పెపైచ్చు, వీరేశలింగం మృతి గురించి, ఒక్క ప్రభావశీలమైన వివరణ కూడా చేయరు. పంతులుగారు ఉన్నది మద్రాసులోనే అని స్పష్టపరచరు.
ఇలా రాశారు: ‘‘ఇంకా రెండు రోజులకు మరణిస్తాడు అనగా కూడా ఆ మాటలే చెప్పి వాగ్దానం తీసుకున్నాడాయన. శారదకు ఆ వాగ్దానంతో బాధలేదు. కాని వీరేశలింగం గారి మరణం బాగా బాధించింది’’. ఎక్కడ జరిగింది మృత్యువు? పేపర్లు ఏమని రాశాయి? ఇవేవీ లేకుండానే నవలకు మూల ఘట్టం వంటిది రాయవచ్చునా? ఇక ఇంతకు మించినది ఏమిటంటే, కొమర్రాజు మరణస్థలాన్ని ఆయన స్వగ్రామానికి మార్చడం. ఆయన కూడా తన అనారోగ్యం వల్ల 12-7-1923న, ఏ గదిలో వీరేశలింగం మరణించారో, అదే గదిలో కన్నుమూశారు. దీన్ని సాహిత్య అకాడెమీ ప్రచురణలో కె.కె రంగనాథాచార్యులు తెలిపారు. కొమర్రాజు మరణం సంభవించింది తన స్వగ్రామం పెనుగంచిప్రోలులో కాదు. మరి నవలలో ఏ ప్రయోజనం ఆశించి ఓల్గా ఇలా చిత్రణ చేశారో స్పష్టం కాలేదు.
సైమన్ కమిషన్ విషయం, అచ్చమాంబ జీవితంలో 1928 నాటి ప్రధానమైన రాజకీయ ఘట్టం, తగు చిత్రణ కాలేదు. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కారణంగానే, ఆమెను, మదరాసు యూనివర్సిటీ డాక్టరీ పరీక్షకు కూచోనివ్వదు. అప్పుడు ఆమె తన పరీక్ష ఉత్తీర్ణత కోసం ఇంగ్లాండు వెళ్ళి వచ్చారని ఆమె మేనల్లుడు, విశాఖలో ఫ్రొఫెసర్ డాక్టర్ కొమర్రాజు రవి తెలిపారు.
స్త్రీని తక్కువచేసి చూడటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తమ భావజాలంలోని ఛాందసత్వంలోంచి బయటకు రావాలని, మనుష్యుల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య, వర్గాల మధ్య, నెలకొని ఉన్న ఆధిపత్య భావన నిర్మూలన జరిగే సమాజమే, మంచి సమాజమని తలపోస్తూ, 1965 ప్రాంతాల్లో కన్ను మూస్తుంది శారదాంబ. మంచి ఒడుపుతో రాసిన ఈ రచనలో, కల్పనగా అయితే, పేజీలు తిరిగి పోతాయి గబగబా. ఈ కథనం వెనకాల చరిత్ర, సమీప శతాబ్దపు నిజమైన వ్యక్తులు ఉన్నారు అని చూశామా, ఈ పంటి కింది రాళ్లు ఒక మంచి పాఠకానుభవానికి అడ్డం పడతాయి. ఏది ఏమైనా చర్చకు మిగిలే ఎన్నో అంశాలను కళారూపంలో ప్రస్తావించిన ఓల్గాను అభినందించకుండా ఉండలేము. ఆ అభినందనలో భాగమే ఈ ప్రశ్నలు కూడా.
రామతీర్థ
9849200385