గాంధీలో బాంబు పేలుడు
గాంధీ ఆస్పత్రి : గాంధీ కళాశాల ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగ్రింది. స్థానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్యుల బృందం బాధితులకు వైద్యసాయం అందించింది. పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంతో వివిధ చానళ్ల ప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.... తూచ్.. ఇదంతా నిజమనుకుంటున్నారా..వట్టిదే..
బాంబు దాడుల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణం ఎలాంటి వైద్యసేవలు అందించాలన్న అంశంపై గురువారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ‘బాంబు బ్లాస్ట్ మాక్ డ్రిల్’ లోని సన్నివేశాలివి.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఐఈఎంఎస్) ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్లో భాగంగా ఎమర్జెన్సీ వైద్యంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. ఈ సందర్భంగా వైద్యులు వివిధ అం శాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ ఎమెర్జెన్సీ మెడిసిన్, ట్రామాకేర్లపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.