‘ఉపాధి’లో అక్రమాల వెల్లువ
కోటపల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఏడోవిడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి సిబ్బంది అక్రమాలు బయటపడ్డాయి. ఆరు నెలల్లో చేపట్టిన రూ.1.22 కోట్ల విలువైన పనులపై సామాజిక తనిఖీ బృందాలు చేసిన తనిఖీ వివరాలు వెల్లడించాయి. ప్రజావేదికకు అడిషనల్ పీడీ గణేష్‌జాదవ్, విజిలెన్స్ మేనేజర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ పీడీ అంజయ్య, ఏపీడీలు సురేష్, అనిల్‌చౌహాన్ హాజరయ్యారు.
స్థానిక ఎస్సార్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీ బృందం వివరాలు వెల్లడించింది. షట్పల్లి క్షేత్రసహాయకుడు రాజబాపు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డాడ ని వెల్లడి కావడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీడీ చెప్పారు. లబ్ధిదారులకు తెలియకుండా బినామీ పేర్లతో డబ్బులు స్వాహా చేశాడని పేర్కొన్నారు. ఆయన నుంచి రూ.90 వేలు రికవరీ చేయనున్నట్లు వివరించారు. కొండంపేట గ్రామపంచాయతీలో రూ.20 వేల నిధులు దుర్వినియోగమయ్యాయని, రికవరీకి ఆదేశాలిచ్చామని తెలిపారు.
రికార్డుల నిర్వహణ సరిగా లేనందుకు 12 మంది ఎఫ్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించామన్నారు. వీటితోపాటు పింఛన్ల పంపిణీలో అక్రమాలు బయటపడగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన తనిఖీ వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. ప్రజావేదికలో ఎంపీడీవో శంకరమ్మ, ఏపీవోలు వెంకటేశ్వర్లు, రామ్మోహన్, ఏపీఎం ఉమారాణి, సర్పంచులు దుర్గం మహేష్, విద్యాసాగర్‌గౌడ్, వెంకటస్వామి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.