గణపతి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
భద్రాచలం : పవిత్ర గోదావరి నదిలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం భద్రాచలం ఇన్చార్జ్ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ రాజీవ్ పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తులకు, వారి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని; ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాంపు వద్ద లాంచీలలో గణేష్ విగ్రహాలను ఒకదాని తరువాత ఒకటి వచ్చేలా చూడాలన్నారు. అందుకు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులకు సహకరించాలని కోరారు. గోదావరి నది పెరిగినా, తగ్గినా తదనుగుణంగా అధికారులు నిమజ్జనాన్ని సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాంప్ వద్ద గోదావరికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని దేవస్థానం, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో తగినంతమంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కరకట్టపై వాహనాలు వచ్చే రూట్లలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతమున్న రెండు లాంచీలకు అదనంగా 8వ తేదీన ఒకటి, 12వ తేదీన మరొకటి తెప్పించి నిమజ్జన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. నిమజ్జన విజయవంతానికి సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్.ఆశలత, సర్పంచ్ బి.శ్వేత, దేవస్థానం డీఈ రవీందర్, ఇరిగేషన్ డీఈ, ఏఈ హెచ్వి.రాంప్రసాద్, వెంకన్న, ఫైర్ ఆఫీసర్ పి.సురేష్కుమార్, ట్రాన్స్కో ఏడీఈ కోక్యానాయక్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.