ganjai case
-
స్వామీజీల ముసుగులో గంజాయి రవాణా
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21 కోట్ల విలువైన 484 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తున్న కొందరు వ్యక్తులు అదే వాహనంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీల వేషధారణలో కొందరు వాహనంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వాహనంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్రానికి చెందిన మున్షీరాం, భగత్, గోవింద్ పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో వీరు ఆటో కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంలా మార్చారు. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కలిమెలిలో గంజాయిని కొనుగోలు చేసి హరియాణాలో విక్రయించేందుకు వీరు బయలుదేరారని సీఐ తెలిపారు. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు
విశాఖపట్టణం: విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు చింతపల్లి, సీలేరు తదితర ప్రాంతాల నుంచి 65 కిలోల గంజాయిని వాహనాల్లో తరలిస్తుండగా రోలుగుంట మండలం పెద్దపేట కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 65 కిలోల గంజాయి, వ్యాను, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.2.35లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. (రోలుగుంట)