gargeyapuram
-
నేడు సీఎం కర్నూలు పర్యటన
గార్గేయపురం నగరవనం సందర్శన రద్దు – ఉదయం 9.45కు కర్నూలుకు చేరుకోనున్న సీఎం – సాయంత్రం 4.45కు ముగియనున్న పర్యటన కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కర్నూలు మండలం గార్గేయపురంలోని నగరవనాన్ని సందర్శించేలా ముఖ్యమంత్రి పర్యటనను జిల్లా యంత్రాంగం రూపొందించింది. అయితే చివరకు ఇది రద్దయింది. కేవలం నగర పర్యటనకు మాత్రమే ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు చేశారు. ఉదయం 9.45 గంటలకు కర్నూలు చేరుకోనున్న ముఖ్యమంత్రి పర్యటన సాయంత్రం 4.45 గంటలకు ముగుస్తుంది. కర్నూలు నగరంలో మూడు గంటల పాటు జనచైతన్య యాత్రలో భాగంగా పాతబస్తీలో పాదయాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కార్యక్రమంలో, మధాహ్నం 2.30 నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన వివరాలు ఇలా.. ఉదయం 9.45 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10 గంటలకు కిడ్స్ వరల్డ్‌కు చేరుకుంటారు. ఉదయం 10 నుంచి 12 గంటలకు జనచైతన్య యాత్రలో భాగంగా కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల, గీతా మందిర్ మీదుగా కోల్స్ కళాశాల వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు కోల్స్ కళాశాలలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 2.10 గంటలకు స్టేట్ గెస్ట్‌హౌస్ చేరుకొని 2.30 వరకు రిజర్వులో ఉంటారు. 2.30 గంటలకు స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి బయలు దేరి అవుట్ డోర్ స్టేడియంకు వెళ్తారు. 2.35 నుంచి 4.30 గంటల వరకు డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. 4.45 గంటలకు ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండులోని హెలిప్యాడ్ చేరుకొని హెలిక్యాప్టర్‌లో విజయవాడకు బయలుదేరుతారు. -
సిటీ పార్కుగా గార్గేయపురం చెరువు
–జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు. అటవీ, టూరిజం, ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఇస్తానని వివరించారు. కర్నూలు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే విధంగా పార్కును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ నెమళ్లు ఇతర ఆకర్షణీయమైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చిన్నచిన్న కాటేజీలు ఏర్పాటు చేయడంతోపాటు రెస్టారెంటు కూడ నిర్మించాలన్నారు. సంగమేశ్వరంలో రెండు బోట్లు ఉన్నాయని అందులో ఒకదానిని గార్గేయపురం చెరువుకు తీసుకురావాలన్నారు. సమావేశంలో అటవీశాఖ కన్జర్వేటర్ జేఎస్ఎన్ మూర్తి, కర్నూలు డీఎఫ్ఓ చంద్రశేఖర్, జిల్లా పర్యాటకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.