garment manufacturers
-
11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత
బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్మెంట్ ఇండస్ట్రీలోని దాదాపు 40లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసనకు పాల్పడిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. కార్మికుల సమస్యలు ఇవే.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ పాత్ర కీలకం. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది. కరోనా సమయంలో దుస్తుల డిమాండ్ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% వస్త్ర ఎగుమతులు తగ్గాయి. ముడిచమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీస వేతనం కింద రూ.9458(12,500 టాకాలు) చెల్లిస్తున్నారు. అయితే దాన్ని రూ.17400(23,000 టాకాలు)కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పనిప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పరిశ్రమల్లోని విషపూరిత వాయువులను పీల్చి చాలామంది కార్మికులు వివిధ వ్యాధుల బారినపడుతున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అక్కడి కార్మికుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ వారికి సరైన మౌలికవసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో మహిళలు లైంగికహింసకు గురవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే.. బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్దెనిమిది గ్లోబల్ కంపెనీలు అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాయి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కొత్త కనీస వేతనం నిర్ణయించాలని కోరాయి. హెచ్ అండ్ ఎం, లెవీస్, గ్యాప్, పూమా.. వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్‌లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
1,600 మంది కార్మికులకు ఉద్వాసన
ఢాకా: బంగ్లాదేశ్‌లోని 85 వస్త్ర తయారీ పరిశ్రమలు తమ సంస్థల్లో పనిచేస్తున్న 1,600 మంది కార్మికులను విధుల నుంచి తొలగించాయి. అక్రమంగా నిరసనల్లో పాల్గొన్నందుకు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేసి సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయేలా చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.4,560 నుంచి రూ.13,767కు పెంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో ఈ నెల ప్రారంభంలో పరిశ్రమలు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో అక్కడ పండగలకు దుస్తుల సరఫరా నిలిచిపోతుందేమోనని భయాందోళనలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమల కార్మికుల సంఘం మాత్రం 3,500కు పైగా కార్మికులను తొలగించారని తెలిపింది. పోలీసుల అరెస్టులు, వేధింపులకు భయపడి ఎంతోమంది కార్మికులు దాక్కుంటున్నారని అక్కడ కార్మిక సంఘాలు చెబుతున్నాయి.