చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్‌లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది.
వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment