సిరియా
నైసర్గిక స్వరూపం
ఖండం: ఆసియా
వైశాల్యం: 185180 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2,20,87,048 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: డమాస్కస్
ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
కరెన్సీ: సిరియన్ పౌండ్
అధికారిక భాష: అరబిక్
మత: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు.
వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగష్టులో 18 నుండి 37 డిగ్రీలు ఉంటుంది.
పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు.
పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు.
సరిహద్దులు: ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, మధ్యధరా సముద్రం.
స్వాతంత్య్ర దినోత్సవం: 1944 జనవరి 1
పరిపాలనా విధానం: సిరియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 14 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని గవర్నోరేట్ అని అంటారు. ఇవి తిరిగి 61 జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. జనాభా ఎక్కువగా రాజధాని డమాస్కస్ చుట్టూ అలాగే యూఫ్రటీస్ నదీ తీరం వెంబడి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.దేశంలోని పది పెద్ద నగరాలు... డమాస్కస్, అలెప్పొ, హోమ్స్ లటా కియా, హమా, అల్ రక్కఫ్, డీర్ ఎజ్జోర్, అల్హసకా, క్వామిష్లీ, సయ్యిదా జన్సబ్లు
చరిత్ర: క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజల ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో నిత్యమూ పోరాటాలు, చిన్నపాటి యుద్ధాలు నేడు చోటు చేసుకుంటున్నాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఒకప్పుడు సిరియా దేశం వివిధ దేశాల రాజులకు యుద్ధభూమిగా ఉండేది. ‘సిరియన్లు’ ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నాయి. సమీప దేశాలతో వీరి వ్యాపార బంధాలుగా చైనా, భారతదేశం, అరబ్బు దేశాలలో ఉన్నాయి. దేశాన్ని ఫోనేషియన్ల తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్ రాజుల పరిపాలించారు. క్రీస్తుశకం 632లో ముస్లిం మత నమ్మకం కలిగిన ప్రాఫెట్ మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు కలీఫాలు పరిపాలించారు. క్రీ.శ. 1095లో యూరోపు నుండి క్రైస్తవులు క్రమంగా వచ్చి ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్రీ.శ. 1114లో సుల్తాన్ నూరుద్ధీన్ అనే రాజు క్రమంగా సిరియాదేశాన్ని ఆక్రమించి క్రిస్టియన్లను తరిమివేశాడు. 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1944తో సిరియా దేశం స్వాతంత్య్రం పొందింది.
ఆహారం: మాంసం, రొట్టెలు వీరి ప్రధాన ఆహారం. గోధుమ, మైదా పిండితో బన్, రొట్టె, బ్రెడ్డు లాంటి పదార్థాలు తయారుచేస్తారు. వీటితో పాటు సూప్‌లు, కూరలు ఉంటాయి. అన్నం, మాంసం కలిపి ముద్దలు చేస్తారు. వీటిని బ్రెడ్డుతో లేదా రొట్టెతో కలిపి తింటారు.
ప్రజలు-సంస్కృతి: దేశంలో 74 శాతం మంది ప్రజలు ముస్లిములు. వీరు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. లెవన్టైన్, ఖుర్దు, టుర్కుమెన్, సిర్కాసియన్, గ్రీకులు, జ్యూలు, ఆర్మేనియన్లు... ఇలా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అరబ్బీ, కుర్దెష్ భాషలు మాట్లాడుతారు.
వివిధ తెగల వాళ్ళు వారివారి సాంప్రదాయరీతులలో వస్త్రధారణ చేస్తారు. ఇది ప్రాంతాలవారీగా ఉంటుంది. సాధారణంగా పురుషులు పొడవాటి గౌన్లను ధరిస్తారు. దీనిని కఫ్తాన్ అంటారు. స్త్రీలు పొడవాటి రోబ్‌లను ధరిస్తారు. కేవలం చేతులు, పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు తలలకు పాగాలు ధరిస్తారు. యువతీయువకులు మాత్రం ప్యాంటు, షర్టు, జీన్స్ ధరిస్తారు. అలంకరణ సామగ్రిని ఉపయోగిస్తారు. ధనిక కుటుంబాల మహిళలు మాత్రం కురచ దుస్తులు ధరిస్తారు. సాధారణంగా మహిళలు ఇంటి వ్యవహారాలు చూసుకుంటారు. గ్రామాలలో మహిళలు ఇంటిపనులతో పాటు పొలం పనులకు కూడా వెళతారు.
చూడవలసిన ప్రదేశాలు
1. డమాస్కస్: దేశ రాజధాని డమాస్కస్ నగరం కిక్కిరిసిన జనాభాతో నిండిన నగరం. నగరం నలుదిశలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. బైజాంటైన్ ఆర్కేడ్ అనేది జూపిటర్ దేవుని ఆలయం. దీనిని రోమన్ పరిపాలకులు నిర్మించారు. ఈ ఆర్కేడ్ సమీపంలోనే ఉమ్మాయ్యద్ మసీదు ఉంది. దీనినే గ్రాండ్ మాస్క్ అంటారు. దీనిని పూర్వం ఒకటవ కాన్‌స్టాంట్‌నోపుల్ అనే రోమన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ మసీదుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మసీదు లోపలి భాగంలో శిఖరం లోపలి భాగంలో ఇప్పటికీ సెయింట్ జాన్ తల భాగం నిలిచి ఉంది. మరో విశేషం 2001లో పోప్ జాన్ పాల్-2 ఈ మసీదును సందర్శించాడు.
ఇక డమాస్కస్ పాత నగరంలో పురాతన కట్టడాలు, ఇళ్ళు, ఇతర నిర్మాణాలు ఎన్నో దర్శనమిస్తాయి. అప్పటికాలంలో రోమన్లు, ముస్లింలు, క్యాథలిక్కులు, జ్యూలు నిర్మించిన కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నగరంలోని హేజాజ్ రైల్వేస్టేషన్ భవనాన్ని చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఒట్టోమాన్ రాజుల కాలంలో నిర్మించిన ఈ భవనం నేటికీ రైల్వేస్టేషన్ భవనంగా ఉపయోగపడుతోంది.
2. అలెప్పో నగరం: కనుచూపు మేర వరకు విస్తరించిన నగరం అలెప్పో. ఈ నగరం అన్ని రకాలుగానూ ఎంతో ధనవంతమైన నగరంగా కనబడుతుంది. కిక్కిరిసిన ఇళ్ళు, చారిత్రక కట్టడాలు, ప్రజల సంస్కృతులు... ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం అలెప్పో. నగరంలోని పురాతన కట్టడాలను ప్రభుత్వం సంరక్షిస్తుంది. సెయింట్ సిమియన్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ ఒకే ప్రదేశంలో నాలుగు చర్చి భవనాలు కలిసి ఒక శిలువ ఆకారంలో ఉంటాయి. మధ్యభాగంలో స్పైలైట్ స్తంభం ఉంది. ఆ కాలంలో ఆ స్తంభం మీద నిలబడి సెయింట్ జార్జ్ ప్రజలతో మాట్లాడేవారు. ఈ స్తంభం 25 మీటర్ల ఎత్తు ఉంది. నగరంలో మరో కట్టడం సిటాడెల్. ఇది యునెస్కో సంరక్షిత భవనంగా ఉంది. నగరంలో క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించిన ఆల్ కికన్ మాస్క్ నేటికీ అద్భుతంగా నిలిచి ఉంది.
సిటాడెల్ 165 అడుగుల ఎత్తు, 1476 అడుగుల పొడవు, 1066 అడుగుల వెడల్పుతో ఉంటుంది. శతాబ్దాలుగా ఎందరో రాజులను, చక్రవర్తులను చూసిన ఈ కట్టడం నేడు మౌనసాక్షిగా నిలబడి ఉంది.
3. హమాలో నీటి చక్రాలు: హమా ఒక పురాతన నగరం. ఇది ఓరోంటిస్ నదీతీరంలో ఉంది. మధ్యయుగం నాటి నుండీ ఈ నగరం ఉందన్న చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు అధికం. బైజాంటియన్ రాజులు ఇక్కడ నీటి చక్రాలను మొట్టమొదట ఏర్పరిచారు. ఆ కాలంలో నదిలోని నీటిని తోడడానికి ఈ విశాలమైన నీటి చక్రాలను నిర్మించారు. చక్రాలను తిప్పుతూ ఉంటే నదిలోని నీళ్ళు చక్రాల చివరలలో ఉన్న డబ్బాలలో నిండి బయటికి వస్తాయి. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ఏర్పరచిన ఈ నీటిచక్రాలు నేటికీ పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం కేవలం 17 నీటిచక్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క చక్రం వ్యాసార్థం 66 ఫీట్లు ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ నీటి చక్రాలు ఆ కాలంనాటి నీటిపారుదుల తీరుకు అద్దం పడుతుంది.
4. రోమన్ల సాక్షి బోస్రా : సిరియా దేశంలో ఉన్నన్ని చారిత్రక ప్రదేశాలు మరే దేశంలోనూ కనబడవు. అందుకే విదేశీయులు సిరియా దేశాన్ని అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. బోస్రా ఒక పురాతన నగరం. రోమన్ చక్రవర్తులు నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. సందర్శకులను అది మంత్ర ముగ్ధులను చేస్తుంది. దీనిని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆనాటి కట్టడం నేటికీ ఏమాత్రం శిథిలం కాకుండా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బోస్రా నగరం రాజధాని డమాస్కస్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ నగరం ఆకాలంలో నబాషియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, అరబ్ ముస్లిం రాజులు దీనిని పాలించారు. రోమన్లు నిర్మించిన ఆంఫిథియేటర్లో దాదాపు 18 వేల మంది కూర్చోగలిగే వీలు ఉంది. స్టేజి పొడవు 148 అడుగుల పొడవు, 26 అడుగుల లోతులో ఉంటుంది.
5. పాల్మీరా: పాల్మీరా కట్టడాలు ఒకటవ శతాబ్దానికి చెందినవి. ప్రజలు ఈ కట్టడాలను రెండు పేర్లతో పిలుస్తారు
1. ఎడారి పెళ్ళికూతురు- ఎందుకంటే ఈ ప్రదేశం ఎడారిలో ఉంది. ఇక్కడ ఒక ఒయాసిస్సు ఉంది. బాటసారులు ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి పాల్మీరా దగ్గర విడిది చేసేవారు.
2. తాడ్మోర్- ఆధిపత్యానికి ప్రతీక. ఏ రాజులు దీనిని ఆక్రమించినా వెంటనే దానిని వదిలేసి వెళ్ళిపోయేవారు. అది మళ్ళీ ఒంటరిగా నిలిచి ఉండేది. ఎడారి కావడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడే టెంపుల్ ఆఫ్ బాల్ నిర్మాణం ఉంది. పూర్వకాలంలో ప్రజలు ఈ దేవాలయాన్ని తమ కోర్కెలు తీరినపుడు జంతువులను బలి ఇవ్వడానికి ఎంచుకున్నారు. బైజాంటైన్ రాజులకాలంలో ఈ దేవాలయం మార్పు చెంది చివరికి ఒక మసీదుగా, ఆ తర్వాత రాజుల సైనికులకు విడిది ప్రదేశంగా మారిపోయింది. టూంబుల లోయ కూడా ఇక్కడే ఉంది. ఈ లోయలోని టూంబులు దాదాపు ఈజిప్టులోని పిరమిడ్ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ టూంబులలో ఆకాలపు రాజుల వారి కుటుంబ సభ్యుల మృత దేహలను భద్రపరిచే సమాధులు. నేటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడే మ్యూజియం, అరబ్ క్యాజిల్‌లు చూడదగిన కట్టడాలు.