ఓర్లాండో నరమేధం: ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్
వాషింగ్టన్ : అమెరికాలోని ఓర్లాండో నరమేధం అనంతరం ఫేస్ బుక్ తన యూజర్ల భద్రతపై మరింత దృష్టిసారించింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన స్పెషల్ ఫీచర్ 'భద్రతా తనిఖీ ఫీచర్' ను ఆదివారం నుంచి అమెరికాలో యాక్టివేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా స్నేహితులు ఆపదలో ఉంటే వారిని యూజర్లు గుర్తించి, వారిని భద్రతాప్రాంతంలో ఉంచేలా సహకరించనుంది. 'ఐయామ్ సేఫ్' అనే బటన్ ను నొక్కగానే వారి స్నేహితులకు, ఆప్తులకు, ఆపదకు గురైన యూజర్లు ఆ ప్రమాదంనుంచి బయటపడినట్టు, క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. స్నేహితులు భద్రంగా ఉన్నారో లేదో యూజర్లు కూడా తెలుసుకునేలా ఈ ఫీచర్ ను రూపొందించారు. ఫేస్ బుక్ ఈ భద్రతా తనిఖీ ఫీచర్ ను 2014 అక్టోబర్ లోనే ఆవిష్కరించింది. పారిస్ లో తీవ్రవాదుల అటాక్స్ వంటి సందర్భాల్లో ఈ ఫీచర్ యూజర్లకు ఎంతో సహకరించింది.
ఫోర్లిడా రాష్ట్రంలోని పల్స్ గే నైట్ క్లబ్ లో జరిగిన ఓ ఉన్మాది విచక్షణా రహిత కాల్పుల్లో 50 మందికి పైగా చనిపోగా.. మరో 52 గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఉన్మాదిని అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్(29)గా పోలీసులు గుర్తించారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అయితే ఈ ఉన్మాది అమెరికా పౌరుడేనని, టెర్రరిజం వాచ్ లిస్ట్ లో ఇతను లేడని బీబీసీ రిపోర్టు నివేదించింది. నేరపూరిత చర్యతో సంబంధంలేని దానిలో అతనిపై విచారణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ అమెరికా ప్రజలకు ఈ భద్రత తనిఖీ ఫీచర్ ను యాక్టివేట్ చేసింది.