Gayathri manthra
-
పాఠశాలల్లో గాయత్రీ మంత్రం
చండీగఢ్: పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం ప్రార్ధనగా గాయత్రీ మంత్రం జపించాలని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ తెలిపారు. దైవ ప్రార్థనల్లో గాయత్రీ మంత్రానికి సమున్నత స్థానం ఉందనీ, అందుకే ప్రార్ధనా గీతంగా మార్చామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేశామనీ, ఇది సానుకూల ఫలితాలను ఇచ్చిందనీ వివరించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమైందో సంస్కృతీ విలువలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు గాయత్రీ మంత్రాన్ని ప్రార్ధనా గీతంగా చేశామని ముఖ్యమంత్రి ఖట్టర్ అన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వచ్చే మంగళవారం ఆదేశాలు జారీ చేయనుంది. -
గాయత్రి మంత్ర జప దీక్షాధారణ
గుంటూరు ఈస్ట్ : పండరీపురం 5వ లైనులోని యాజ్ఞవల్క్య క్షేత్రంలో ఆదివారం సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ఆధ్వర్యంలో ద్వికోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్మయానంద భారతీ స్వామి 250 మందికి జప దీక్ష ఇచ్చారు. మంత్రం స్వీకరించిన వారు సామూహిక జపం చేశారు. నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయానంద భారతీ స్వామి ప్రసంగిస్తూ దీక్షా ధారణ చేసిన వారు 120 రోజుల పాటు ఒక సహస్ర గాయత్రి జపం చొప్పున లక్ష గాయత్రి జపం చేసిన అనంతరం సామూహిక గాయత్రి హోమాలు నిర్వహిస్తామన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉపనీతులైన బ్రాహ్మణులందరి చేత సంధ్యావందనం చేయించాలనే లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ముద్రాసహితంగా గురుముఖత సం ధ్యానవందనం నేర్పిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం జపాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.