gcc coffee
-
అరకు కాఫీ రుచి చూసిన జి 20 సమ్మిట్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించడం గమనార్హం. ఈ గ్లోబల్ ఈవెంట్లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శన ద్వారా ప్రీమియం కాఫీ బ్రాండ్‌గా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సాక్షికి తెలిపారు. జి20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. జీసీసీకి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శోభా స్వాతిరాణి, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో అరకు కాఫీని సైతం అందజేయడం విశేషం. -
ఇక అరకు ఇన్స్టెంట్ కాఫీ ఘుమఘుమలు!
సాక్షి, విశాఖపట్నం: కమ్మని రుచితో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న అరకు కాఫీ మరో ముందడుగు వేయనుంది. ఫిల్టర్ కాఫీలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న అరకు కాఫీ తాజాగా ఇన్స్టెంట్ రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. 2, 10 గ్రాముల సాచెట్లతో సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సన్నద్ధమైంది. ఈ సంక్రాంతి కల్లా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జీసీసీ ఎండీ ఆకెళ్ల రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. 2 గ్రాముల సాచెట్ రూ.3, 10 గ్రాముల సాచెట్ ధర రూ.12గా నిర్ణయించారు. జీసీసీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 120 వరకు పంపిణీదార్లున్నారు. 900 డీఆర్ డిపోలు, పెద్ద సంఖ్యలో రిటైల్ ఔట్లెట్లు, సూపర్ మార్కెట్లు ఉన్నా యి. వీటిలో ఇప్పటిదాకా ఇతర కంపెనీల కాఫీ ప్యాకెట్లు/సాచెట్లను విక్రయిస్తున్నారు. వీటి ద్వారా అరకువే లీ ఇన్స్టెంట్ కాఫీ సాచెట్లను విక్రయించనున్నారు. బల్క్ ఆర్డర్లు కూడా... దేశంలో పలు ప్రాంతాల్లో అరకు కాఫీకి గిరాకీ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో అవసరమైన వారికి బల్క్ ఆర్డర్లను కూడా సరఫరా చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఏర్పాటు చేస్తున్న అరకు కాఫీకి ఎంతో ఆదరణ ఉంటోంది. విశాఖ ఏజెన్సీలో కాఫీని సేంద్రియ ఎరువుతో పండిస్తారు. అక్కడ నేల స్వభావం, సేంద్రియ ఎరువుతో పండించడం వల్ల మంచి రుచి, సువాసనను కలిగి ఉంటుంది. అందువల్ల కాఫీ ప్రియులు అరకు కాఫీని అమితంగా ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సాచెట్లను ప్రవేశపెట్టాలని జీసీసీ నిర్ణయించింది. ఏలూరులో ఉన్న వాహన్ కాఫీ కేంద్రంలో ఇన్స్టెంట్ కాఫీ సాచెట్లను తయారీ, ప్యాకింగ్‌లను చేపడుతున్నారు. ప్రాథమికంగా 2 గ్రాముల ఇన్స్టెంట్ కాఫీ మూడు లక్షలు, 10 గ్రాముల సాచెట్లు లక్ష చొప్పున తయారు చేయనున్నారు. ఇందుకు 7 టన్నుల కాఫీ పొడి అవసరమని భావిస్తున్నారు. ఆదరణకనుగుణంగా మున్ముందు ఈ సాచెట్ల తయారీని విస్తృతం చేస్తామని రవిప్రకాష్ తెలిపారు. -
జీసీసీ బ్రాండ్‌తోఇక ‘అరకు’ కాఫీ... త్వరలో మార్కెట్లోకి....
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన అరకు కాఫీ ఇకపై సొంత బ్రాండ్ ఇమేజిని సంతరించుకోనుంది. ‘అరకువ్యాలీ కాఫీ’ పేరుతో ఆర్గానిక్ కాఫీ మార్కెట్లోకి రానుంది. ఈ కాఫీ తయారీకి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలకు అనువైన వాతావరణం ఉంది. ప్రస్తుతం అక్కడ 96,337 ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఇందులో అరబికా రకాన్నే గిరిజన రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకులో పండించే అరబికా రకం కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ అరబికా కాఫీనే మార్కెట్లోకి తేవాలని తొలిసారిగా జీసీసీ సన్నాహాలు చేస్తోంది. కాఫీ గింజలను ఈ-ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసి పౌడర్‌ను తయారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఈ సంవత్సరం ప్రాథమికంగా 10 టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేయాలనుకుంటోంది. అరబికాలోని చెర్రీ, ప్యాచ్మెంట్లతోపాటు రెబెస్టా రకాలను 70 శాతం, చెకోరి 30 శాతం కలిపి బ్లెండెడ్ కాఫీని తయారు చే స్తారు. దీనిని ‘అరకు వ్యాలీ’ కాఫీ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ అరకువ్యాలీ కాఫీని 50, 100, 250, 500 గ్రాముల ప్యాక్‌లలో అమ్మకాలు జరుపుతారు. వీటిని జీసీసీ అన్ని ఔట్‌లెట్లలోనూ, డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కాకుండా ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంచుతారు. సంక్రాంతి నాటికి ఈ కాఫీ పౌడర్‌ను మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు ప్రారంభించినట్టు జీసీసీ జనరల్ మేనేజర్ (రిటైల్ మార్కెటింగ్) అశోక్ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖలోని జీసీసీ ప్రధాన కేంద్రం వద్ద ఉన్న ఔట్లెట్లో కొనుగోలుదార్లకు ఉచితంగా ‘అరకువ్యాలీ’ కాఫీని రుచి చూపిస్తామని తెలిపారు. రూ. 2 కోట్ల వ్యాపారం లక్ష్యం.. విశాఖ ఏజెన్సీలో పండే ఆర్గానిక్ కాఫీకి యూరప్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ కాఫీ అధిక శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. అందువల్ల ఇక్కడ పండిన కాఫీ రుచి తెలుగు ప్రజలకు అందడం లేదు. అరకువ్యాలీ కాఫీ అందుబాటులోకి వస్తే ఆ లోటు తీరుతుంది. ఈ అరకువ్యాలీ కాఫీ ధర ఇతర ప్రముఖ కంపెనీల కాఫీకంటే తక్కువగా ఉండేలా చూస్తాం. మెరుగైన నాణ్యత, అసలైన కాఫీ రుచి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కాఫీ ఉత్పత్తి చేసే ప్రభుత్వ సంస్థ జీసీసీనే. అరకువ్యాలీ కాఫీ అమ్మకాలను ఈ ఏడాది రూ.2 కోట్లకు పైగానే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి మరింతగా వృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఔట్సోర్సింగ్ ద్వారా కాఫీ తయారీ చేయిస్తున్నాం. కొద్దిరోజుల్లో సొంతంగా కాఫీ తయారీ (పల్వరైజింగ్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. - ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాష్, ఎండీ, జీసీసీ