జీసీసీ బ్రాండ్‌తోఇక ‘అరకు’ కాఫీ... త్వరలో మార్కెట్లోకి....
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన అరకు కాఫీ ఇకపై సొంత బ్రాండ్ ఇమేజిని సంతరించుకోనుంది. ‘అరకువ్యాలీ కాఫీ’ పేరుతో ఆర్గానిక్ కాఫీ మార్కెట్లోకి రానుంది. ఈ కాఫీ తయారీకి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలకు అనువైన వాతావరణం ఉంది. ప్రస్తుతం అక్కడ 96,337 ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఇందులో అరబికా రకాన్నే గిరిజన రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకులో పండించే అరబికా రకం కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ అరబికా కాఫీనే మార్కెట్లోకి తేవాలని తొలిసారిగా జీసీసీ సన్నాహాలు చేస్తోంది. కాఫీ గింజలను ఈ-ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసి పౌడర్‌ను తయారు చేయాలని భావిస్తోంది.
ఇందుకోసం ఈ సంవత్సరం ప్రాథమికంగా 10 టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేయాలనుకుంటోంది. అరబికాలోని చెర్రీ, ప్యాచ్‌మెంట్‌లతోపాటు రెబెస్టా రకాలను 70 శాతం, చెకోరి 30 శాతం కలిపి బ్లెండెడ్ కాఫీని తయారు చే స్తారు. దీనిని ‘అరకు వ్యాలీ’ కాఫీ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ అరకువ్యాలీ కాఫీని 50, 100, 250, 500 గ్రాముల ప్యాక్‌లలో అమ్మకాలు జరుపుతారు. వీటిని జీసీసీ అన్ని ఔట్‌లెట్లలోనూ, డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కాకుండా ఆన్‌లైన్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంచుతారు. సంక్రాంతి నాటికి ఈ కాఫీ పౌడర్‌ను మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు ప్రారంభించినట్టు జీసీసీ జనరల్ మేనేజర్ (రిటైల్ మార్కెటింగ్) అశోక్ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖలోని జీసీసీ ప్రధాన కేంద్రం వద్ద ఉన్న ఔట్‌లెట్‌లో కొనుగోలుదార్లకు ఉచితంగా ‘అరకువ్యాలీ’ కాఫీని రుచి చూపిస్తామని తెలిపారు.
రూ. 2 కోట్ల వ్యాపారం లక్ష్యం..
విశాఖ ఏజెన్సీలో పండే ఆర్గానిక్ కాఫీకి యూరప్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ కాఫీ అధిక శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. అందువల్ల ఇక్కడ పండిన కాఫీ రుచి తెలుగు ప్రజలకు అందడం లేదు. అరకువ్యాలీ కాఫీ అందుబాటులోకి వస్తే ఆ లోటు తీరుతుంది. ఈ అరకువ్యాలీ కాఫీ ధర ఇతర ప్రముఖ కంపెనీల కాఫీకంటే తక్కువగా ఉండేలా చూస్తాం. మెరుగైన నాణ్యత, అసలైన కాఫీ రుచి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కాఫీ ఉత్పత్తి చేసే ప్రభుత్వ సంస్థ జీసీసీనే. అరకువ్యాలీ కాఫీ అమ్మకాలను ఈ ఏడాది రూ.2 కోట్లకు పైగానే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి మరింతగా వృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఔట్‌సోర్సింగ్ ద్వారా కాఫీ తయారీ చేయిస్తున్నాం. కొద్దిరోజుల్లో సొంతంగా కాఫీ తయారీ (పల్వరైజింగ్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం.
- ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాష్, ఎండీ, జీసీసీ