చిన మావయ్యతో సినిమా
మెగా కుటుంబంలో ఇప్పుడు నాలుగు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’, మెగాబ్రదర్ నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’ సంస్థలపై చాలా చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు రానున్న ‘ఖైదీ నం. 150’ తో ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ని రామ్‌చరణ్, ఆ మధ్య ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ‘గంగోత్రి’తో పాటు ‘హ్యాపీ’, ‘బద్రీనాథ్’, ‘సరైనోడు’ చిత్రాలను ఆయన తండ్రి నిర్మాణ సారధ్యంలోని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నిర్మించింది.
ఇప్పటి వరకూ ‘అంజనా ప్రొడక్షన్స్’లో అల్లు అర్జున్ ఒక్క సినిమా కూడా చేయ లేదు. ఇప్పుడా ముచ్చట తీర్చుకుంటున్నారు. చిన మావయ్య నాగబాబు నిర్మాతగా, బన్నీ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. రచయిత వక్కంతం వంశీని అల్లు అర్జున్ దర్శకుడిగా పరిచయం చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌తో కలసి నాగబాబు నిర్మించనున్నారు. వచ్చే మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.