నిందితులుగా గీతారెడ్డి, సబిత, ధర్మాన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో దాఖలు చేసిన రెండు ఛార్జీ షీట్లలో మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు పేర్లను నిందితులుగా చేర్చారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ టెక్ ప్రాజెక్టుపై చార్జీషీట్లు దాఖలు చేశారు. ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ అధికారులు మొత్తం 8 డబ్బాలలో కోర్టుకు తీసుకువచ్చారు. లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్లో మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందూ టెక్ ప్రాజెక్టు ఛార్జి షీట్లో పది మంది పేర్లను నిందితులుగా చేర్చారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జీషీట్లో 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి గీతారెడ్డిని ఏ-9గా, ధర్మాన ప్రసాదరావును ఏ-11గా సీబీఐ పేర్కొంది. ఏ-1 జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ3 శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, ఏ-6 లేపాక్షి చైర్మన్ శ్రీనివాస బాలాజీ, ఏ-7 బీపీ ఆచార్య, ఏ-8 శ్యామ్సన్రాజు, ఏ-10 శ్యామ్యూల్, ఏ-12 మురళీధర్‌రెడ్డి, ఏ13 ప్రభాకర్‌రెడ్డి, ఏ14 జగతి పబ్లికేషన్స్‌లను పేర్కొన్నారు.
ఇందూ టెక్ ప్రాజెక్టు చార్జీషీట్లో ఏ-1 జగన్, ఏ2, విజయసాయి, ఏ3 శ్యామ్ ప్రసాద్, ఏ4 ఇందూ ప్రాజెక్ట్, ఏ5 ఇందూటెక్, ఏ6 ఎస్పీఆర్ ప్రాజెక్ట్, ఏ-7 రత్నప్రభ, ఏ8 మాజీ మంత్రి సబిత, ఏ-9 బీపీ ఆచార్య పేర్లను చేర్చారు.
ఇదిలా ఉండగా, తన పేరు ఛార్జిషీట్ లో దాఖలు చేసిన నేపధ్యంలో మంత్రి గీతారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.