'ఆమెపై నా మాటలు తప్పే'
మైసూరు: గుండ్లుపేట నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్పై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ ఆదివారం వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెను క్షమాపణ కూడా కోరడం జరిగింది. శనివారం బన్నితాళపురలో బీజేపీ అభ్యర్థి నిరంజన్కుమార్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ప్రతాపసింహ మాట్లాడుతూ భర్త చనియిన మూడు రోజులకే గీతా మహాదేవ ప్రసాద్ తానే అభ్యర్థిని అని ప్రకటించుకున్నారని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆదివారం ప్రతాపసింహ మైసూరులో మీడియా సమావేశం పెట్టి తన మాటలు గీత మహాదేవప్రసాద్కు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఆ స్థానం ఇవ్వడం జరుగుతుందని, ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయని అన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, ఆమెను బాధపెట్టి ఉంటే క్షమించాలని, తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.