ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
పాలకొల్లు టౌన్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికోసం అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సి ఉందని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలో ఉన్న అన్నీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రప్రభుత్వం దాటవేయడం దారుణమని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేహి అని కేంద్రప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పనిలేదని, ఇది ఏ ఒక్క కులానికో, మతానికో, పార్టీ నాయకులకో సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్టీలు, ప్రజలు, నాయకులు సమష్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ఈనెల 9న కాకినాడలో తలపెట్టిన ఆత్మగౌరవ సభను జయప్రదం చేయడం ప్రజలందరి కర్తవ్యమని పేర్కొన్నారు.