యువతి దారుణ హత్య
వర్గల్(గజ్వేల్): గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఎక్కడో హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కల్వర్టు కింద పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ అమానవీయ ఘటన సోమవారం వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ క్షేత్రం పక్కనే రాజీవ్ రహదారి కల్వర్టు కింద వెలుగుచూసింది. ఘటన స్థలాన్ని గజ్వేల్ ఏసీపీ నారాయణ, రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై వీరన్నలు పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి గజ్వేల్ ఏసీపీ నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 22–25 సంవత్సరాల మధ్య వయసున్న గుర్తు తెలియని యువతిని పథకం ప్రకారం గుర్తు తెలియని అగంతకులు ఎక్కడో చంపేశారు.
సింగాయపల్లి అడవి పక్కనే రాజీవ్ రహదారి కల్వర్టు కింద పడేశారు. ముఖం మీద, శరీరంపై పెట్రోల్ చల్లి తగులబెట్టారు. మృతదేహం గుర్తుపట్టరానంతగా కాలిపోయింది. కల్వర్టు గోడలో మృతదేహం ఉండడం వల్ల ఎవరూ గుర్తించలేదు. సోమవారం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించిన అనంతరం అక్కడే పోస్టుమార్టం జరిపి ఖననం చేశారు.
నాలుగు రోజుల క్రితం హత్య జరిగినట్లు భావిస్తున్నామని ఏసీపీ నారాయణ తెలిపారు. మహిళ హత్య ఘటనపై కేసు నమోదు చేసి ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతురాలి శరీరంపై నలుపు రంగు పంజాబీ డ్రెస్ ఉంది. కాగా డ్రెస్‌పై ఎరుపు రంగు పూలు ఉన్నాయి. ఎడమ చేతికి రోల్డ్ గోల్డ్ ఉంగరం, ఎడక కాలికి నలుపు రంగు దారం ఉంది. కాలును గమనిస్తే వికలాంగురాలు అనిపిస్తున్నది. మహిళ వివరాలు తెలిసిన వారు గజ్వేల్ ఏసీపీ– 83339 98684, గజ్వేల్ రూరల్ సీఐ– 94906 17022, గౌరారం ఎస్సై– 94409 01839కు సమాచారం అందించాలని ఏసీపీ నారాయణ సూచించారు.