కొబ్బరి చెట్టుతో 'వాలెంటైన్స్ డే'
రాష్ట్రంలో పరిరక్షించాల్సిన వృక్షజాతి జాబితా నుంచి కొబ్బరిచెట్టును గోవా ప్రభుత్వం గత నెలలో తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీని ఈసారి 'కోకోనట్ వాలెంటైన్'గా వినూత్నంగా జరుపుకోవాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోవా ప్రజలు నిర్ణయించారు. పరిరక్షణ చెట్ల జాబితా నుంచి కొబ్బరిచెట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా జనవరి 14వ తేదీ కావడం గమనార్హం.
గోవా వాసులకు కొబ్బరిచెట్లంటే ప్రాణం. వాటిని వారు కల్పవృక్షాలుగా, సాంస్కృతిక సంపదగా పరిగణిస్తారు. అత్యవసరమై ఓ కొబ్బరి చెట్టును కొట్టివేయాలంటే అనుమతి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉన్నా వారెన్నడూ బాధ పడలేదు. ఇప్పుడు ఇష్టానుసారం కొబ్బరిచెట్లను కొట్టివేసేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 'ప్రజల్ సఖార్దాండే ఆఫ్ గోవా హెరిటేజ్ యాక్షన్ గ్రూప్' లాంటి సంస్థల పిలుపు మేరకు ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చెట్ల పట్ల తమకున్న ప్రేమాభిమానాలు చాటాలనుకుంటున్నారు.
ఈ నెల 6వ తేదీ నుంచే 'కోకోనట్ వాలెంటైన్' ఆందోళన కార్యక్రమం ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీన ముగుస్తుంది. ఈ వారం రోజులు పిల్లలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు కొబ్బరి చెట్ల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ వాటివద్ద ఫొటోలు దిగుతారు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కామెంట్లు షేర్ చేసుకుంటారు.