goa politics
-
పదవి సత్యం... పార్టీ మిథ్య!
అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ. చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్... గయా రామ్’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్ కామత్ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే! -
గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిలైంది?
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన బలానికి చాలా దగ్గరగా ఉండి, ఒక చిన్న పార్టీ మద్దతిచ్చేందుకు ముందుకు కూడా వచ్చిన సందర్భంలోనూ తాము గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైక కారణం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయనతో పాటు గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ వల్లే తమకు అధికారం దక్కలేదని గోవా పీసీసీ చీఫ్ లుజిన్హో ఫాలైరో తీవ్రంగా ఆరోపించారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండటంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటుచేస్తామని గోవా కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ, కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికే రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీ ఫిగర్‌ను సాధించింది. నిజానికి తాము మద్దతిస్తామంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ముందుగా దిగ్విజయ్ సింగ్‌తోనే చెప్పారు. వాళ్లకు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. మరొక్క ఇండిపెండెంట్ మద్దతు తీసుకోవడం పెద్ద కష్టం కానే కాదు. కానీ అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగిందన్నది స్థానిక కాంగ్రెస్ నాయకుల వాదన. ముందుగానే గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి ఉంటే, అతిపెద్ద పార్టీగా ముందు తమకే అవకాశం వచ్చి ఉండేదని ఫాలైరో అన్నారు. మనోహర్ పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దిగ్విజయ్ సింగ్ స్పందించి ఉంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అప్పటికి సిద్దంగా ఉన్నారు. మార్చి 11వ తేదీ రాత్రికి తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అయితే తమవద్ద వాళ్ల సంతకాలు మాత్రం లేవని ఫాలైరో చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో అన్ని అధికారాలను దిగ్విజయ్, వేణుగోపాల్‌లకు ఇచ్చిందని, వాళ్లు సరైన సమయంలో స్పందించకపోవడం.. మరోవైపు బీజేపీ వెంటవెంటనే స్పందించడం వల్లే తమకు అధికారం దూరమైందని ఆయన వాపోయారు. తాను ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునేవాడినని తెలిపారు. -
కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ
పణజి: అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది. హైకమాండ్ తీరు నచ్చక ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయగా మరో ఎమ్మెల్యే కూడా అదే బాట పట్టారు. రాహుల్ గాంధీని తనకు నాయకుడిగా అంగీకరించబోనంటూ పార్టీకి సావియో రోడ్రిగ్యుస్ రాజీనామా చేశారు. రాణె రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడడం గమనార్హం. ‘గోవా ఎన్నికల్లో పార్టీ ఓటమికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు(రాహుల్ గాంధీ) బాధ్యత వహించలేదు. దిగ్విజయ్ సింగ్ మాత్రమే నైతిక బాధ్యత వహించార’ని సావియో పేర్కొన్నారు. అధినాయకత్వం అసమర్థతను నిరసిస్తూ విశ్వజీత్ రాణె గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గోవా అసెంబ్లీలో నిన్న జరిగిన బలపరీక్షకు ఆయన హాజరుకాలేదు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతరుల మద్దతుతో బలపరీక్షలో నెగ్గి కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తీసింది. -
తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి!
సాధారణంగా కేంద్ర మంత్రి స్థాయిలో.. అది కూడా రక్షణ శాఖ లాంటి అత్యంత కీలకమైన శాఖ చేతిలో ఉన్న మంత్రికి తిండి సరిగ్గా దొరక్కపోవడం అనే సమస్య ఉందంటే నమ్మగలరా? కానీ అది నిజం. రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. తగిన తిండి దొరక్కపోవడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గోవా రాజధాని పణజిలో ఓటు వేసేందుకు ఆయన ఇంకా పోలింగ్ బూత్ తెరవక ముందే వచ్చేశారు. ఉదయం 7.10 గంటలకల్లా ఓటు వేసి బయటకు వచ్చేశారు. ''నాకు గోవా ఆహారం అంటే ఇష్టం. దాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా అన్వయించుకోవచ్చు'' అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆహారం నచ్చకపోవడం వల్ల తాను నాలుగు కిలోల బరువు తగ్గిపోయానన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తారని అంచనాలున్నాయి. పారికర్ తిరిగొచ్చే అవకాశాలను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రచార పర్వంలో ఉన్నప్పుడు కొట్టి పారేయలేదు. ఇంతకుముందు ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు పారికర్ నిరాకరించారు గానీ, తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం మళ్లీ ఆయన సీఎం కావడం ఖాయమనిపిస్తోంది. గోవా చేపల కూర, బటర్ చికెన్.. ఇవన్నీ తనకు ఇష్టమని, అయితే తాను పార్టీకి కట్టుబడిన వ్యక్తిని కాబట్టి పార్టీ ఎలా ఆదేశిస్తే అలాగే చేస్తానని పారికర్ గతంలో కేంద్ర మంత్రి అయినప్పుడు అన్నారు. తన స్థానంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు గానీ, పారికర్ స్థాయిని, ఆయన ఇమేజ్‌ని అందుకోలేక పర్సేకర్ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గోవాలో చతుర్ముఖ పోటీ ఉన్నమాట వాస్తవమే గానీ, ఇందులో మూడు ముఖాలు చాలా బలహీనంగా ఉన్నాయని పారికర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయమన్నారు. గోవాలో ఉన్న మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు గాను ఇంతకుముందు బీజేపీ 21 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 36 స్థానాల్లో నేరుగా పోటీ చేస్తుండగా, మరో నాలుగు చోట్ల పార్టీ మద్దతిచ్చిన స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పోలింగ్ 85 శాతం వరకు ఉండొచ్చన్నది పారికర్ అంచనా. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే 53 శాతం దాటింది. -
‘కలిసి పనిచేస్తారు.. సీఎం ఆయనకింద కాదు’
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రస్తుత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి పనిచేస్తారే తప్ప.. ఆయన కింద ఉండి పనిచేయరని ఉత్తర గోవాకు చెందిన ఎంపీ శ్రీపాద్ నాయుడు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రిగా ఎవరొస్తారనే విషయం ఇంకా బీజేపీ నిర్ణయించలేదని అన్నారు. గోవా రాజకీయాల్లోకి తనకు వెళ్లాలని ఉందని పారికర్ చెప్పడంతోపాటు, ఎన్నికల తర్వాతే గోవాకు రాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని పార్టీ హైకమాండ్ చెబుతోందని తొలుత నితిన్ గడ్కరీ, అనంతరం అమిత్‌షా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మండలిలో సభ్యుడిగా ఉన్న శ్రీపాద్ యాదవ్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం ఇంకా జరగలేదు. దానిని ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి అయోమయం లేదు. పారికర్ ప్రభుత్వ పెద్దగా వస్తారు. ఆయన అనుభవాన్ని గోవా ప్రభుత్వానికి అందించి ప్రజలకు అనుకూలన పాలన అందించేందుకు సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆయనతో కలిసి పనిచేస్తారే తప్ప ఆయన కింద మాత్రం కాదు’ అని శ్రీపాద్ స్పష్టం చేశారు.