తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి! | i have lost 4 kg weight due to delhi food, says manohar parrikar | Sakshi
Sakshi News home page

తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి!

Published Sat, Feb 4 2017 2:45 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి! - Sakshi

తిండిలేక.. బరువు తగ్గిపోయిన మంత్రి!

సాధారణంగా కేంద్ర మంత్రి స్థాయిలో.. అది కూడా రక్షణ శాఖ లాంటి అత్యంత కీలకమైన శాఖ చేతిలో ఉన్న మంత్రికి తిండి సరిగ్గా దొరక్కపోవడం అనే సమస్య ఉందంటే నమ్మగలరా? కానీ అది నిజం. రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. తగిన తిండి దొరక్కపోవడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గోవా రాజధాని పణజిలో ఓటు వేసేందుకు ఆయన ఇంకా పోలింగ్ బూత్ తెరవక ముందే వచ్చేశారు. ఉదయం 7.10 గంటలకల్లా ఓటు వేసి బయటకు వచ్చేశారు. ''నాకు గోవా ఆహారం అంటే ఇష్టం. దాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా అన్వయించుకోవచ్చు'' అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆహారం నచ్చకపోవడం వల్ల తాను నాలుగు కిలోల బరువు తగ్గిపోయానన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తారని అంచనాలున్నాయి. పారికర్ తిరిగొచ్చే అవకాశాలను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రచార పర్వంలో ఉన్నప్పుడు కొట్టి పారేయలేదు. ఇంతకుముందు ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు పారికర్ నిరాకరించారు గానీ, తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం మళ్లీ ఆయన సీఎం కావడం ఖాయమనిపిస్తోంది. 
 
గోవా చేపల కూర, బటర్ చికెన్.. ఇవన్నీ తనకు ఇష్టమని, అయితే తాను పార్టీకి కట్టుబడిన వ్యక్తిని కాబట్టి పార్టీ ఎలా ఆదేశిస్తే అలాగే చేస్తానని పారికర్ గతంలో కేంద్ర మంత్రి అయినప్పుడు అన్నారు. తన స్థానంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు గానీ, పారికర్ స్థాయిని, ఆయన ఇమేజ్‌ని అందుకోలేక పర్సేకర్ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గోవాలో చతుర్ముఖ పోటీ ఉన్నమాట వాస్తవమే గానీ, ఇందులో మూడు ముఖాలు చాలా బలహీనంగా ఉన్నాయని పారికర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయమన్నారు. గోవాలో ఉన్న మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు గాను ఇంతకుముందు బీజేపీ 21 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 36 స్థానాల్లో నేరుగా పోటీ చేస్తుండగా, మరో నాలుగు చోట్ల పార్టీ మద్దతిచ్చిన స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పోలింగ్ 85 శాతం వరకు ఉండొచ్చన్నది పారికర్ అంచనా. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే 53 శాతం దాటింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement