సమయం లేదు మిత్రమా..!
నిడదవోలు : గోదావరి డెల్టా ఆధునికీకరణకు సమయాభావం శాపంలా మారుతోంది. కాలువ మూసివేత సమయం విషయంలో అధికారుల అనాలోచిత ధోరణి వల్ల పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాదీ పనులకు సమయం మించిపోతోంది. ఇంకా 12 రోజులే గడువు ఉంది. దీంతో అత్యధిక పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఫలితంగా పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
60 రోజుల క్లోజర్ సమయం
వాస్తవానికి ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు ఉన్న 60 రోజుల సమయాన్ని క్లోజర్ పనుల కోసం కేటాయించాలి. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ ఏడాది వరి కోతలు ఆలస్యంగా పూర్తయ్యాయి. దీంతో పంటల రక్షణ తోపాటు, తాగునీటి అవసరాల కోసం డెల్టా పరిధిలోని కాలువలకు 19 రోజుల పాటు అదనంగా నీటిని విడుదల చేశారు. పంటలు పొట్ట దశలో ఉండటం, మంచినీటి చెరువులు నిండకపోవడంతో కాలువల మూసివేత తేదీని అధికారులు పెంచుతూ వచ్చారు. దీనివల్ల ఆధునికీకరణ పనులకు సమయం లేకపోయింది.
88 పనులకు టెండర్లు రాలేదు
గోదావరి డెల్టా పరిధిలో ఈ ఏడాది 153 ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం రూ.143 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు టెండర్లు పిలిచారు. రూ.100 కోట్లతో చేపట్ట నున్న 65 పనులకు మాత్రమే కాంట్రా క్టర్ల నుంచి టెండర్లు వచ్చాయి. వీటిలో కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకా రూ.43 కోట్లతో చేపట్టనున్న 88 పనులకు టెండర్లు రాలేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా సమయం తక్కువగా ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
నీరు చెట్టు పథకంలో..
ఈ ఏడాదీ నీరుచెట్టు పథకంలోనూ పనులు చేపట్టారు. డెల్టా పరిధిలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో 86 పనులకు రూ.5.83 కోట్లు కేటాయించారు. డెల్టా పరిధిలో ఉన్న ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల్లో కర్రనాచు తొలగింపుతోపాటు నాలుగు అడుగుల మేరకు పూడిక మట్టిని తొలగించాల్సి ఉంది. కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రెయిన్లలో పూడిక తీత పనులు చేపట్టాల్సి ఉండగా కేవలం కర్రనాచు పనులు మాత్రమే ఎక్కువగా చేపడుతున్నారు. ఏటా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం, కాలువల మూసివేత సమయం సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయడం లేదు. ఇరిగేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలు వేయడంలో విఫలం కావడమే పనులు ముందుకు సాగకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
గతేడాదీ అరకొర పనులే
గతేడాదీ ఆధునికీకరణ పనుల్లో భాగంగా 63 పనులకు రూ.69.77 కోట్లతో టెండర్లు పిలవగా రూ.23.84 కోట్లతో 39 పనులను మాత్రమే పూర్తి చేశారు. కాలువల మూసివేత సమయం సరిపోకపోవడంతో రూ.18.06 కోట్లతో ప్రారంభించిన 13 పనులు అసంపూర్తిగా మిగిలాయి. అవి ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. రూ.23.84 కోట్లతో టెండర్లు పిలిచిన 11 పనులు అసలు ప్రారంభించలేదు. గతేడాదిలా ఆఖరి రోజుల్లో తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి పూడిక తీత పనుల చేపట్టి సొమ్ము చేసుకోవడానికి కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసినట్టు పలువురు రైతులు చెబుతున్నారు.
కాంట్రాక్టర్లు ఎందుకు రాలేదంటే..!
ఈ ఏడాది 88 ఆధునికీకరణ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీనికి సమయాభావంతోపాటు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, మార్కెట్ ధర ప్రకారం బిల్లులు ఇవ్వకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. బస్తా సిమెంట్‌కు ప్రభుత్వం రూ.190 ఇస్తుం డగా, బయట మార్కెట్లో రూ.300కు కాంట్రాక్టర్లు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం టన్ను ఐరన్‌కు రూ.32 వేలు ఇస్తుండగా, మార్కెట్లో టన్ను రూ.45వేలు పలుకుతోంది. అందుకే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు రావడం లేదని సమాచారం.
డెల్టాలో చేపట్టిన పనులు
ఈ ఏడాది టెండర్లు వచ్చిన 65 పనుల పూర్తికి సమయం చాలదని అధికారులే చెబుతున్నారు. వీటిల్లో ప్రధాన కాలువతోపాటు చానల్స్, పంట బోదెలు, డ్రెయిన్లలో పూడికతీత, రిటైనింగ్ వాల్స్, హెడ్ స్లూయిజ్, లాకుల పునర్నిర్మాణ పనులు ఉన్నాయి. వీటిల్లో ఉండి నియోజకవర్గంలో 15 పనులు, తాడేపల్లిగూడెం పరిధిలో 3, నిడదవోలులో 2, ఉంగుటూరులో 1, తణుకులో 6, భీమవరం పరిధిలో 8, పాలకొల్లులో 9, నరసాపురం 1, ఆచంట నియోజకవర్గంలో 9 పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.
50 శాతం పనులు పూర్తి చేస్తాం
డెల్టా కాలువలకు నీటి విడుదల చేసే సమయానికి ఆధునికీకరణ పనులను 50 శాతం పూర్తి చేస్తాం. 85 పనులకు అసలు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాలువల రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలు కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాతైనా చేసుకోవచ్చు.
– కె.రఘునాథ్, ఇరిగేషన్ ఎస్ఈ, ఏలూరు