అమలాపురం, న్యూస్‌లైన్ : గోదావరి డెల్టా ఆధునికీకరణను అటు సర్కారూ చిన్నచూపు చూస్తుండగా ఇటు కాలమూ కలిసిరావడం లేదు. అస్తవ్యస్తంగా మారిన పంట కాలువలను ఆధునికీకరించేందుకు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.1,130 కోట్లు మంజూరు చేశారు. పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి 2007లో టెండర్లు పిలిచారు. తొలుత తూర్పుడెల్టాలో కాకినాడ, మండపేట, కోటిపల్లి బ్యాంకు కెనాల్, సామర్లకోట, మధ్యడెల్టాలో పి.గన్నవరం ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి.
తరువాత రెండేళ్ల వరకు టెండర్లు పడకపోవడంతో మిగిలిన నాలుగు ప్యాకేజీలను 16 చిన్నప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. మధ్యడెల్టా పరిధిలోని ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ పరిధిలో అన్నంపల్లి నుంచి పల్లంకుర్రు వరకు రూ.72 కోట్ల విలువ చేసే రెండు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. ఆధునికీకరణ పనులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2012 జూన్ నాటికి పూర్తి కావలసి ఉంది. గడువు ముగిసి ఏడాది దాటినా 33 శాతం పనులు కూడా పూర్తికాలేదు. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరుగుతోంది.
అయితే ప్రభుత్వం దానికి తగ్గట్టు నిధులు పెంచకపోగా ఉన్న పనులను(లాకులు, వంతెనల పనులు) కుదించడంతో ఆధునికీకరణ లక్ష్యమే వరద గోదాట్లో ఇసుకతిన్నెలా మరుగున పడుతోంది. సకాలంలో నీరందక, వరదల్లో నీరు చేలను ముంచెత్తి రైతులు ఏటా రూ.వందల కోట్ల నష్టాలను మూటగట్టుకోవలసి వస్తోంది.
ఈ ఏడాది రూ.75 కోట్లే
టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ఇంత వరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.350 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.75 కోట్లకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆధునికీకరణ పనులు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. సొమ్ములు మిగిలే మట్టి పనులు మాత్రమే చేసి నిర్మాణ పనులకు దూరంగా ఉండడం కూడా పనులు ఆలస్యం కావడానికి కారణమవుతోంది.
డెల్టా ఆధునికీకరణకు కాలమూ ప్రతికూలంగా మారింది. ఏటా ఖరీఫ్ పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోవడంతో రబీలో పంట కాలువలకు లాంగ్ క్లోజర్ ప్రకటించే అవకాశం లేకుండా పోతోంది. రెండేళ్ల క్రితం గోదావరిలో నీటికి ఎద్దడి నెలకొన్న సమయంలో మాత్రమే మండపేట, కాకినాడ కాలువలను మూసివేసి పనులు చేయగలిగారు. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేకపోయింది. ఈ ఏడాది పంటకాలువల మూసివేత సమయంలో రూ.75 కోట్లతో ఆధునికీకరణ పనులు చేయాలని ఇటీవల కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అధికారులు తేల్చారు.
మార్చి నెలాఖరు నుంచి జూన్ 15 వరకు కాలువలు మూసివేసి 75 రోజుల్లో ఆధునికీకరణ పనులు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది రబీసాగు ఆలస్యం కావడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు డెల్టాకు సాగునీరందించక తప్పదు. దీంతో క్లోజర్ సమయం 45 రోజులకే పరిమితం కానుంది. ఈ కారణంగా ఈసారీ పెద్దగా పనులు జరిగే ఆశ లేకుండా పోయింది.
‘సిరిరేఖల’పై పెను నిర్లక్ష్యం
Published Sat, Jan 18 2014 3:30 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement