వైఎస్సార్ జనభేరి
హరితసీమలో పర్యటించిన జననేత
అడుగడుగునా వెల్లువెత్తిన జనం
మమత ప్రతిధ్వనించిన
‘జై జగన్’ నినాదం
ప్రతి గుండెకూ కొండంత నిబ్బరం.
సాక్షి, అమలాపురం : మలినం లేని ప్రేమకు మారుపేరు కోనసీమ. ఆ గడ్డవాసులు మేలు చేసిన వారిని గుండెల్లో దాచుకుంటారు. దైవంలా కొలుస్తారు. ఆత్మబంధువులా ఆదరిస్తారు. అవసరమైతే ప్రాణం పెడతారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాల్ని చవి చూపిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఇక్కడి వారికి ఇలపై వెలసిన దైవమే.
అదే అభిమానం ఆయన కుటుంబంపైనా చూపుతూ వస్తున్నారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట సాగిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజన్న తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కోనసీమలో పర్యటించారు.
గతంలోనూ ఆయన ఈ గడ్డకు వచ్చినా.. తమ ఆత్మబంధువు ఎప్పుడు వచ్చినా తమకు పండగే అన్నట్టు కోనసీమ వాసులు మురిసిపోయారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంతో పాటు ముమ్మిడివరం నియోజకవర్గంగా మీదుగాసాగిన జగన్ రోడ్ షోకు అపూర్వస్పందన లభించింది. కోనసీమ వాసులు గుండెలోతుల్లోంచి ఎగసే అభిమానంతో జననేతను ఉక్కిరిబిక్కిరి చేశారు.
జననేత తొలుత అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి నివాసం వద్ద వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటన సాగినంత మేరా మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్లకిరువైపులా జనం బారులు తీరారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఊరూవాడా జగన్ నినాదాలతో మార్మోగాయి. పలుచోట్ల జనం తమ అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు. హైస్కూల్ విద్యార్థులు తరగతులను వదిలి, ఁజై జగన్* కేరింతలు కొట్టారు.
జగన్ వారికి అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. ైఅమలాపురం హెస్కూల్ సెంటర్, గోఖలే సెంటర్, కూచిమంచి అగ్రహారం, చిన్న వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, మున్సిపల్ కాలనీ, ముమ్మిడివరం గేటు, అశోక్‌నగర్, మద్దాలవారిపేట, పుల్లయ్య రామాలయం, అమెరికన్ ఆస్పత్రి, ఎర్రవంతెన తదితర ప్రాంతాలన్నీ జనసంద్రాలను తలపించాయి.
పలుచోట్ల మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ముస్లింలు, చిన్నారులు తమ అభిమాననేతను చూసేందుకు కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. తమ కష్టనష్టాలను ఆయన వద్ద ఏకరవు పెట్టారు. పింఛన్‌లు రావడం లేదని వృద్ధులు, ఉపకార వేతనాలు అందడం లేదని హైస్కూల్ విద్యార్థులు, ఫీజు రీ యింబర్స్‌మెంట్ లేదని కళాశాల విద్యార్థులు, ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని మహిళలు మొర పెట్టారు. అందరి సమస్యలనూ ఓపిగ్గా వింటూ ముందుకు సాగిన జగన్ ‘మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ ధైర్యం నింపారు.
మీ నాన్న దయే మా ఆయువు..
అమలాపురం మహీపాల వీధిలోని అబ్బిరెడ్డి వీర్రాజు అనే వికలాంగుడు నడవలేకున్నా తనను చూసేందుకు వస్తుండడాన్ని చూసి చలించిన జగన్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైఎస్సార్‌కు వీరాభిమాని అయిన వీర్రాజు మహానేత హయాంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు.
‘మీ నాన్న గారి వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నా’నంటూ వీర్రాజు ఉద్వేగంగా జగన్‌కు చెప్పారు. పుల్లయ్య రామాలయం వీధికి చెందిన మానుకోట రమణమ్మ జగన్‌ను చూసి విచలితురాలైంది. ‘మీ నాన్న హయాంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టారు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పక అధికారంలోకి వస్తా’ వంటూ ఆయనను పట్టుకొని కన్నీటిపర్యంతమైంది.
సీమాంధ్రకు అవసరం మీ నాయకత్వం..
‘సమైక్యాంధ్ర కోసం మీరు ఎంతో పోరాటం చేశారు. అసలు సిసలైన సమైక్య హీరో మీరే’ అంటూ కోనసీమ జేఏసీ నాయకులు బండారు రామ్మోహనరావు అన్నారు. అమలాపురం అమెరికన్ ఆస్పత్రి వద్ద జేఏసీ నాయకులు జగన్‌ను కలిసి అభినందించారు. ‘సీమాంధ్ర అభివృద్ధి కావాలంటే మీలాంటి యువ నాయకత్వం అవసర’మన్నారు.
మీరే మా సీఎం..
భోజన విరామం కోసం జగన్ కిమ్స్ ఆస్పత్రి గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుతో పాటు ఇతర వార్డుల్లో రోగులను పరామర్శించారు. ‘మా నాన్న శంకరనారాయణ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిమ్మల్ని చూడాలంటున్నాడు’ అని ఆయన కుమార్తెలు జగన్ అభ్యర్థించారు.
ఆయన వెంటనే ఐసీయూకు వెళ్లి శంకరనారాయణను పరామర్శించారు. ‘త్వరలోనే కోలుకుంటారు. మీకు అండగా నేనుంటా’నని ధైర్యం చెప్పారు. అనంతరం బయటకొస్తున్న జగన్‌ను చూసి మెడికోలు ‘జై జగన్’, ‘మీరే మా కాబోయే సీఎం..’ అంటూ నినదించారు. కరచాలనం కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీ పడ్డారు. జగన్ ఏ ఒక్కరీ నిరుత్సాహపర్చకుండా అందరినీ పలకరిస్తూ ‘బాగా చదువుకుని దేశానికి సేవ చేయండి’ అంటూ హితవు పలికారు.
హోరెత్తిన బైకు ర్యాలీ
ఎర్రవంతెన నుంచి ముమ్మిడివరం వరకు పార్టీ శ్రేణులు, యువకులు వందలాది బైకులపై జగన్ వెంట కదం తొక్కారు. భట్నవిల్లి, అనాతవరం, మాపాల చెరువు, కొండాలమ్మ చింతల మీదుగా ముమ్మిడివరం వరకు సాగిన రోడ్ షోలో 216 జాతీయ రహదారి జనసంద్రాన్ని తలపించింది.
10 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మూడున్నరగంటలకు పైగా పట్టింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. ముమ్మి డివ రంలో జరిగిన జనభేరి సభకు హాజరైన అశేష జనాన్ని ఉద్దే శించి జగన్ ప్రసంగించారు. త్వరలో రాజన్న రాజ్యం తథ్య మంటూ వారి ఆకాంక్షను ఉద్దీపింపజేశారు.
ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలకుమారి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు, పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, స్టేట్ యూత్ కమిటీ సభ్యుడు తాడి విజయభాస్కరరెడ్డి, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, జిల్లా నాయకులు విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.