మండపేట.. మమకారపు కోట
‘తాపేశ్వరం కాజా’ను ‘తీపిలో రారాజు’ అనొచ్చు. ఆ వంటకం పొరల నడుమ ఇమిడి ఉండే తేనెలాంటి మధురాతి మధురమైన రసమే దానికి కారణం. అలాంటి మాధుర్యాన్నే తలదన్నే మమతల మధువు ప్రజల మనసు పొరల నుంచి జాలు వారుతుండగా తనివి తీరా చవి చూశారు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ సాగిస్తున్న ఆయన శుక్రవారం మండపేటలో రోడ్ షో నిర్వహించారు. ఆ పట్టణానికి ప్రతీక వంటి కలువపువ్వు సెంటర్‌తో సహా ప్రతి కూడలిలో జనాభిమానం వేలరేకులుగా వికసించింది.
సాక్షి, మండపేట :
ఎవరైనా ఎన్నికల ప్రచారం అంటే ‘మా అభ్యర్థికి ఓటేయండి. మా గుర్తుకు ఓటేయండి’ అని అభ్యర్థిస్తారు. కానీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజల బాగోగులు, కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ‘ఆ మహానేత వరవడి పదిలంగానే ఉంది’ అన్న భరోసాను కలిగించారు.
ఎండ మండినా, ఉక్కబోసినా.. అణుమాత్రం అలుపెరగక, వేలమందితో మమేకమయ్యారు. ‘అవ్వా ఎలాగున్నావ్.. అయ్యా బాగున్నవా.. అమ్మా ఏంచేస్తున్నావ్’ అంటూ ఎదలోతుల్లోంచి ఎగసే ఆత్మీయతను పంచారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఇక ప్రజలు.. నిప్పులు చెరిగే ఎండను నలుసంత లక్ష్యపెట్టకుండా తమ అభిమాననేతను చూసేందుకు బాటలకిరువైపులా గంటల తరబడి నిరీక్షించారు. జననేతను చూడగానే పట్టలేని ఆనందంతో జేజేలు పలికారు. ఆయనను దగ్గరగా చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
ఆయనను ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకునిలా కాక తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఆప్యాయతానురాగాలు కురిపించారు. తన వ ద్దకు రాలేని అశక్తులను చూసి, ఎద కదిలిన జననేత తానే వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి అనునయించారు. అది చూసిన జనం ‘మహానేత తనయుడనిపించుకున్నారు.
ఆయనలాగే మా కష్టాలు కడతేర్చేందు కు కంకణం కట్టుకున్నారు’ అంటూ మురిసిపోయారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో రోజైన శుక్రవారం మండపేటలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు కనివినీ ఎరుగని స్పందన లభించింది. పార్టీ మండపేట కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్, మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరిలతో కలిసి నిర్వహించిన ఈ రోడ్ షో సాగినంత మేరా మండపేట మొత్తం కదిలివచ్చిందా అన్నట్టు జనసంద్రమైంది. దారులకిరువైపులా జనం కిక్కిరిసిపోయారు.
అడుగడుగునా హారతులు..
మెయిన్‌రోడ్లోని చౌదరి గెస్ట్‌హౌస్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పెదకాల్వవంతెన వరకూ సాగింది. కామత్ మోటార్స్ ఎదురుగా పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో వందలాదిమంది మహిళలు, యువకులు జగన్ బొమ్మలతో ఉన్న ప్లకార్డులు చేబూని అపూర్వ స్వాగతం పలికారు.
ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్యాన్’ను జననేతకు బహూకరించారు. రాజారత్నం సెంటర్ నుంచి ఎస్సీ కాలనీ, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ, మారేడుబాక సెంటర్, కేపీ రోడ్డు సెంటర్, కలువపువ్వు సెంటర్ వరకు రోడ్లు జనప్రవాహాన్ని తలపించాయి. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా, యువకులు, చిన్నారులు పూలవర్షం కురిపించారు. ఎస్సీ పేట, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చి జగన్నినాదాలు చేశారు.
జగన్‌ను చూసిన వృద్ధులు తమ కుమారుడే కష్టపడుతున్నట్టు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనను అక్కున చేర్చుకొని ‘నువ్వు చల్లంగుండాలయ్యా’ అని దీవించారు. వారితో పాటు మహిళలు ఆయనకు తాపేశ్వరం కాజా, తొక్కుడులడ్డూ, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటారు. ‘మేమంతా నీకు అండగా ఉంటాం. నీకే ఓటేస్తాం’ అంటూ స్పష్టం చేశారు. వారి మమతానురాగాలకు ఉద్వేగానికి లోనైన జననేత ‘మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం వస్తుంది.. మీ అందరికీ మంచి రోజులొస్తాయి’ అని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.
ఓపిక పట్టండి.. వచ్చేది మన సర్కారే..
ఏడేళ్ల క్రితం వంట చేస్తుండగా ముఖమంతా కాలిపోయిన అరివి లోవమ్మ అనే మహిళ రాజారత్నం సెంటర్లోజగన్‌ను కలిసి ఆదుకోవాలంటూ గోడు వెళ్ల బోసుకుంది. ‘మన ప్రభుత్వమొచ్చిన వెంటనే ఆదుకుంటా’నని జగన్ భరోసా ఇచ్చారు. ట్రైసైకిల్‌పై వచ్చిన నందికోళ్ల రాజు, దుర్గా దున్నా అనే వికలాంగుల వద్దకు తానే వెళ్లి పరామర్శించారు.
‘మరో రెండు నెలల్లో మీకు పింఛన్ వెయ్యి రూపాయలు చేస్తా’నని చెప్పారు. అంధురాలైన లంకా నారమ్మ ఇంటికి వెళ్లి ‘పింఛన్ వస్తోందా తల్లీ’ అని ఆరా తీశారు. రావడం లేదని చెప్పగా ‘కొంచెం ఓపిక పట్టమ్మా.. 1000 పింఛన్ ఇప్పిస్తా’నని ధైర్యం చెప్పారు. ముమ్మిడివరపు నాగమణి అనే పోలియో బాధితురాల్ని పరామర్శించారు. న్యూ కాలనీలో రెండుకాళ్లు చచ్చుబడిన నిమ్మలపూడి సత్యనారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
పార్వతమ్మ అనే 95 ఏళ్ల వృద్ధురాలిని కాన్వాయ్‌పై నుంచే చూసి ఆమె వద్దకు వెళ్లి ‘అవ్వా బాగున్నావా’ అంటూ పలకరించడంతో ‘నువ్వు చల్లంగుండు బాబూ’ అని దీవించింది. తనపై కొండంత అభిమానంతో, కడలంత నమ్మకంతో వచ్చిన వారందరికీ అభివాదం చేస్తూ, జననేత వారి కష్టసుఖాలను ఓపిగ్గా విన్నారు. పట్టణ పరిధిలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు ఏకంగా పది గంటలకు పైగా పట్టిందంటే జన నేతపై జనాదరణ ఏ స్థాయిలో అర్థమవుతుంది.
మారుమూలన ఉన్న తమ పేటలకు ఏ రాష్ర్టస్థాయి నాయకులూ రాలేదని, జగన్ ఒక్కరే తమ గడప దగ్గరకు వచ్చారని సామాన్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రోడ్ షోలో రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీఈసీ సభ్యుడు రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, రాష్ర్ట యూత్, బీసీ కమిటీల సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, పెంకే వెంకట్రావు, యువజన నాయకుడు జక్కంపూడి రాజా, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మండపేటలో రోడ్ షో అనంతరం జగన్ సామర్లకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.