అపూర్వ ఆదరణ
సాక్షి ప్రతినిధి, కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లాలో అపూర్వ ఆదరణ లభించింది. మూడు రోజుల జిల్లా పర్యటన దిగ్విజయంగా ముగిసింది. అడుగడుగునా జిల్లావాసులు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. ఈనెల 17వ తేదీ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వయస్సుతో నిమిత్తం లేకుండా వేలాదిగా ప్రజానీకం తరలివచ్చారు.
మండుటెండను సైతం లెక్కచేయక గంటల తరబడి జననేత జగన్ కోసం నిరీక్షించారు. ఇసుక వేస్తే రాలనంతగా జగనాభిమానాన్ని ప్రదర్శించారు. శుక్రవారం ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. గంటల తరబడి మండుటెండలో సూర్యభగవానుడి ని చిన్నబుచ్చుతూ జననేత జగన్ కోసం నిరీక్షణ చేశారు. పులివెందుల కంటే ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు కంటే మైదుకూరు, మైదుకూరు కంటే కమలాపురంలో... ఇలా ఒకచోటికి మించి మరోచోట పెద్ద ఎత్తున ఆప్యాయతను చూపించారు.
జగన్ మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న కమలాపురం పట్టణ ప్రజలు నిద్రకు వెరవకుండా మనిషిని చూస్తే చాలన్నట్లుగా అర్ధరాత్రి సమయంలో కూడా ఎదురుచూశారు. జగన్‌మోహన్‌రెడ్డిని చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. శనివారం రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనభేరి నిర్వహించారు. ఉదయం 11.30గంటలకు రైల్వేకోడూరు సమావేశం ముగియగానే అక్కడి నుంచి చిట్వేలి మీదుగా నెల్లూరుకు బయలుదేరారు. 26 కి.మీ. ఉన్న చిట్వేలికి జగన్ మోహన్‌రెడ్డి చేరుకునేందుకు 6.30గంటల సమయం పట్టింది.
ఈ మార్గమధ్యంలోని పల్లెల ప్రజానీకం పోటీలు పడుతూ ఒకరికి మించి మరొకరు ఆత్మీయతను ప్రదర్శించారు. దిష్టి గుమ్మడి కాయలతో కొందరు, హారతి పల్లెంలతో మరికొందరు, పూలు వెదజల్లుతూ ఇంకొందరు స్వాగతాభిమానాన్ని ప్రదర్శించారు. తమ మనువడు వస్తున్నాడని వృద్దులు మురిసిపోతే, పెద్దన్నయ్య వస్తున్నాడని యువతరం జేజేలు పలికింది. అండగా నిలిచే తోబుట్టువును చూసేందుకు మహిళా లోకం ఆరాటపడింది. మూడు రోజుల వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనను వైఎస్‌ఆర్ జిల్లా ప్రజానీకం అక్కున చేర్చుకుని ముద్దుబిడ్డకు అండగా తామున్నామంటూ నిరూపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల గెలుపు తమ విజయంతో సమానమని, అభ్యర్థులను నిలిపింది మీరైతే గెలిపించుకునే బాధ్యత మాదంటూ జిల్లా ప్రజానీకం జననేత జగన్ మోహన్‌రెడ్డికి అభయమిచ్చినట్లయింది.
పోలీసుల తీరు అభ్యంతరకరం..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి రైల్వేకోడూరులో అనుమతి ఉంది. అయితే పోలీసులు తీవ్ర ఆటంకాలు కల్గించడంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకింత అసహనం, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రైల్వేకోడూరులో వైఎస్ జగన్ ప్రసంగం సాగుతుండగా పోలీసు వాహనం జనం మధ్యలోకి వచ్చింది. జనాన్ని డిస్ట్రబ్ చే యవద్దు. వాహనాన్ని నిలిపేయండని స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి రెండు మూడు సార్లు చెప్పారు. అయినా విన్పించుకోకుండా వాహనం జనం మధ్యలోకి వెళ్లడంతో జగన్ ఒకింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు.