నేడు రాజన్న బిడ్డ రాక
సాక్షి, ఖమ్మం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం జిల్లాకు రానున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 15 వరకు ఆమె జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
గత ఏడాది ఇదే నెల 22న ఆమె జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలోకి అడుగుపెడుతుండడంతో పార్టీ శ్రేణులు ఆమె పర్యటనను విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. షర్మిల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తునతరలివచ్చి పర్యటనలో పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
షర్మిల పర్యటన ఇలా..
13వతేదీ సాయంత్రం 4 గంటలకు ఆమె కూసుమంచి చేరుకోనున్నారు. అక్కడ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా ప్రచారయాత్ర కొనసాగించి సాయంత్రం 5 గంటకు తిరుమలాయపాలెం చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో 7 గంటలకు పెద్దతండా చేరుకుంటుంది. 7.30 గంటలకు ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తారు. నగరంలో వైరారోడ్డు మీదుగా ఆమె రోడ్‌షో జరగనుంది.
14న ఉదయం 10 గంటలకు రఘునాథపాలెం మండలం మంచుకొండ నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి ఉదయం 10.30 గంటలకు కారేపల్లి, 11 గంటలకు గార్ల, సాయంత్రం 4 గంటలకు టేకులపల్లి, సాయంత్రం 5 గంటలకు పాల్వంచ, రాత్రి 7 గంటలకు మణుగూరు వరకు రోడ్ షో కొనసాగుతుంది.
15న ఉదయం 10 గంటలకు అశ్వాపురం నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు సారపాక, మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం, మోరంపల్లి బంజర, సాయంత్రం 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేటలో రోడ్ షోతో జిల్లాలో షర్మిల పర్యటన ముగియనుంది.