నీడ దక్కేది ఏనాడో?
అమలాపురం : పట్టణ పేదల సొంతింటి కల ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకర్లు మొండిచేయి చూపడంతో రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు గూటికి నోచుకోలేకపోతున్నారు. అమలాపురంలో 240 కుటుంబాలు ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నా.. ఆశించిన నీడ చేరువ కాలేదు. ఇల్లు సొంతం కాకున్నా బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీ కట్టాల్సిన భారాన్ని మోస్తున్నారు. అమలాపురంలోని పేదలకు సొంత ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పట్టణ శివారున నల్లమిల్లిలో రాజీవ్ గృహకల్పకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 10 బ్లాకుల్లో రూ.2.85 కోట్లతో 240 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులు తమ వంతుగా రూ.7,500 చొప్పున చెల్లించగా, వారి పేరు మీద బ్యాంకులు మరో రూ.75 వేల చొప్పున రుణం ఇచ్చాయి.
గృహ నిర్మాణ సంస్థ తన వంతుగా రూ.36,500 అందించగా మొత్తం రూ.1.19 లక్షల చొప్పున వ్యయంతో ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ఉమా మహేశ్వరి కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. బ్యాంకర్లు సకాలంలో రుణం నగదు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని ఆ సంస్థ పనులను నిలిపివేసింది. దాంతో ప్రభుత్వం నిర్మాణ బాధ్యతను 2008లో గృహ నిర్మాణ సంస్థకు అప్పగించింది. 240 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్ రూ.1.80 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.70.80 లక్షలు చెల్లించింది. బ్యాంకులు రూ.1.40 కోట్లు చెల్లించకపోవడంతో నిర్మాణానికి అవాంతరాలు ఏర్పాడ్డాయి. నిధులు పూర్తిగా ఇవ్వని బ్యాంకులు ఇచ్చిన రుణాలకు వడ్డీని మాత్రం లబ్ధిదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. లబ్ధిదారునికి ఇచ్చిన రూ.75 వేల రుణానికి రూ.28 వేల వడ్డీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడమే కాక కొన్ని బ్యాంకులు కోర్టులో కేసులు కూడా వేశాయి.
సర్కారుపై నమ్మకం లేదంటున్న లబ్ధిదారులు
ఇళ్ల సముదాయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. గత ప్రభుత్వం రోడ్లు, డ్రైన్ల కోసం రూ.1.12 కోట్లు మంజూరు చేసి, దానిలో రూ.59 లక్షలు ఇచ్చింది. ఏడాది క్రితమే రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన నిధులు రాకపోవడంతో డ్రైన్ల పనులు ప్రారంభం కాలేదు. వాటర్‌ట్యాంక్ నిర్మాణం పూర్తై నడిపూడి కాలువ నుంచి ఇక్కడకు, ఫ్లాట్‌ల మధ్య పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. విద్యుత్ పనులు సైతం అసంపూర్తిగా నిలిచాయి. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ నిర్మించాల్సి ఉంది. వీటన్నింటికీ కలిపి ఎంతలేదన్నా రూ.కోటి వరకు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.కోటి ఇచ్చి 240 కుటుంబాలకు సొంత గూడు దక్కేలా చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖనే నిర్వీర్యం చేస్తోంది. చెల్లింపులు, కొత్త ఇళ్ల నిర్మాణాలను దాదాపు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకం లబ్ధిదారులకు కలగడం లేదు. ఇక స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు మాటల్లో చెప్పింది చేతల్లో చూపేవారు కానందున తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని వారు వాపోతున్నారు.