Rajiv Gruha Kalpa
-
రాజన్న నిను మరువలేమన్న..
సాక్షి, తెనాలి : తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిపోయి, టీడీపీ పాలకులు పునాదిరాళ్లకే పరిమితం చేసిన పులిచింతల రిజర్వాయరుకు 2004 అక్టోబర్‌లో వైఎస్ శంకుస్థాపన చేశారు. అదే రోజు తెనాలి బహిరంగసభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందిస్తానని చెప్పారు. ఆ ప్రకారం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పనులు చకచకా ఆరంభించి చిత్తశుద్ధి చాటుకున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీలో విస్తారంగా పెరుగుతూ వచ్చిన మొక్కజొన్నకు, ఏప్రిల్ ఆఖరు వరకు పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేశారు. కోరిన వరాలనిచ్చిన ప్రజాబంధువు.. గుంటూరు–హనుమాన్‌పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రావుం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండులైన్ల సిమెంటు రోడ్డు, రూ.117 కోట్ల వ్యయంతో కృష్ణా కుడి వరద కట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్‌పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్‌పై 25 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మించారు. భారీ పథకాలతో భరోసా... తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయాలను వైఎస్ స్వయంగా ప్రారంభించారు. అప్పుడే పట్టణం మెుత్తానికి రక్షిత మంచినీటి కోసం ఉద్దేశించిన రూ.93 కోట్ల కృష్ణా జలాల పథకానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం పక్కాగృహాలను నిర్మించారు. చంద్రబాబునాయుడు పేరుతో ఉన్న మరో కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులను మంజూరు చేశారు. కళాకారులకు ప్రభుత్వ పింఛన్‌ను రూ.200 నుంచి రూ. 500లకు పెంచి, అప్పటికి 21 నెలల బకాయిలను చెల్లించారు. కొ త్తగా మరో ఏడువేల మందికి ఇచ్చిన పింఛన్ల లో యాభైమందికి పైగా తెనాలి కళాకారులకు దక్కాయి. -
నడిరోడ్డులో శిలాఫలకం
సాక్షి, వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో నడిరోడ్డులోనే శిలాఫలకం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి కొత్తగా వాహనాలపై వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శిలాఫలకాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఇళ్లు ఇవ్వకుండా రుణమెలా కట్టాలి
తుమ్మపాల (అనకాపల్లి): జిల్లాలో వుడా పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో 276 గ్రామాల ప్రజలకు పట్టణ గృహ లబ్ధిదారులతో సమానంగా రూ.2.50 లక్షలు గృహనిర్మాణానికి మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖామంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మండలంలో శంకరం గ్రామంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప గృహసముదాయాన్ని మంగళవారం ఆయన ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. గృహనిర్మాణానికి రూ.1.60 లక్షలు బ్యాంకు రుణం మంజూరు చేయగా, ముందుగా 10వేలు బ్యాంకులో డిపాజిట్ చేశామని, మిగిలిన రూ.1.50 లక్షలు బ్యాంకు రుణం కట్టాల్సిందిగా బ్యాంకర్లు నోటీసులు కూడా జారీ చేశారన్నారు. గృహాలు అందివ్వకుండా రుణాలు ఎలా కట్టగలమని రుణ మొత్తం ప్రభుత్వమే భరించి గృహాలు మంజూరు చేయ్యాలని లబ్ధిదారులు కోరారు. మంత్రి మాట్లాడుతూ సుమారు పదెకరాల ప్రభు త్వ భూమిలో 13 ఏళ్లుగా అర్ధంతరంగా నిలిచిపోయిన గృహాలకు 9 కోట్లు వెచ్చించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రుణం అంశం తన పరిధిలో లేనందున, రూ.1.83 లక్షలు హడ్కో నిధులపై ముఖ్యమంత్రితో చర్చించి నెలరోజుల్లో లబ్ధిదారులకు మంచి వార్త అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సత్యనారాయణపురం మేగా లే అవుట్‌కు సమీపంలో నిర్మిస్తున్న టిడ్కో భవన నిర్మాణాలను పరిశీ లించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ కార్పొరేషన్ ఎస్ఈ ప్రసాధ్, డిఈ జి.వి.రమేష్, డీఎస్పి వెంకటరమణ, తహసీల్దార్లు సత్యనారాయణ, జ్ఞానవేణి, పట్టణ సీఐ మురళి, హౌసింగ్ డిఈ ధనుంజయరావు, ఆర్‌డబ్లు్యఎస్ డిఈ ప్రసాధ్, రూరల్ ఎస్ఐ ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. -
నీడ దక్కేది ఏనాడో?
అమలాపురం : పట్టణ పేదల సొంతింటి కల ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకర్లు మొండిచేయి చూపడంతో రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు గూటికి నోచుకోలేకపోతున్నారు. అమలాపురంలో 240 కుటుంబాలు ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నా.. ఆశించిన నీడ చేరువ కాలేదు. ఇల్లు సొంతం కాకున్నా బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీ కట్టాల్సిన భారాన్ని మోస్తున్నారు. అమలాపురంలోని పేదలకు సొంత ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పట్టణ శివారున నల్లమిల్లిలో రాజీవ్ గృహకల్పకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 10 బ్లాకుల్లో రూ.2.85 కోట్లతో 240 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులు తమ వంతుగా రూ.7,500 చొప్పున చెల్లించగా, వారి పేరు మీద బ్యాంకులు మరో రూ.75 వేల చొప్పున రుణం ఇచ్చాయి. గృహ నిర్మాణ సంస్థ తన వంతుగా రూ.36,500 అందించగా మొత్తం రూ.1.19 లక్షల చొప్పున వ్యయంతో ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ఉమా మహేశ్వరి కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. బ్యాంకర్లు సకాలంలో రుణం నగదు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని ఆ సంస్థ పనులను నిలిపివేసింది. దాంతో ప్రభుత్వం నిర్మాణ బాధ్యతను 2008లో గృహ నిర్మాణ సంస్థకు అప్పగించింది. 240 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్ రూ.1.80 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.70.80 లక్షలు చెల్లించింది. బ్యాంకులు రూ.1.40 కోట్లు చెల్లించకపోవడంతో నిర్మాణానికి అవాంతరాలు ఏర్పాడ్డాయి. నిధులు పూర్తిగా ఇవ్వని బ్యాంకులు ఇచ్చిన రుణాలకు వడ్డీని మాత్రం లబ్ధిదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. లబ్ధిదారునికి ఇచ్చిన రూ.75 వేల రుణానికి రూ.28 వేల వడ్డీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడమే కాక కొన్ని బ్యాంకులు కోర్టులో కేసులు కూడా వేశాయి. సర్కారుపై నమ్మకం లేదంటున్న లబ్ధిదారులు ఇళ్ల సముదాయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. గత ప్రభుత్వం రోడ్లు, డ్రైన్ల కోసం రూ.1.12 కోట్లు మంజూరు చేసి, దానిలో రూ.59 లక్షలు ఇచ్చింది. ఏడాది క్రితమే రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన నిధులు రాకపోవడంతో డ్రైన్ల పనులు ప్రారంభం కాలేదు. వాటర్‌ట్యాంక్ నిర్మాణం పూర్తై నడిపూడి కాలువ నుంచి ఇక్కడకు, ఫ్లాట్ల మధ్య పైప్లైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. విద్యుత్ పనులు సైతం అసంపూర్తిగా నిలిచాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నిర్మించాల్సి ఉంది. వీటన్నింటికీ కలిపి ఎంతలేదన్నా రూ.కోటి వరకు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.కోటి ఇచ్చి 240 కుటుంబాలకు సొంత గూడు దక్కేలా చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖనే నిర్వీర్యం చేస్తోంది. చెల్లింపులు, కొత్త ఇళ్ల నిర్మాణాలను దాదాపు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకం లబ్ధిదారులకు కలగడం లేదు. ఇక స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు మాటల్లో చెప్పింది చేతల్లో చూపేవారు కానందున తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని వారు వాపోతున్నారు. -
అధికారంలోకి రాగానే నగరానికి 5వేల ఇళ్లు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిజామాబాద్ నగరానికి మొదటి విడతలో ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహిం చిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోనూ పేదలకు ఇళ్లు కట్టిస్తానన్నారు. రూ. 4 లక్షలతో ప్లాట్లను కేటాయించి వంద శాతం సబ్సిడీతో ఇళ్లు కట్టుకోవచ్చునని అన్నా రు. ఇందుకు మొదటి విడతగా నగరానికి 5 వేల ఇళ్లు మంజూరు చేస్తానన్నారు. గతంలో రాజీవ్ గృహకల్ప కింద నిర్మించిన ఇళ్లు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవని, ఇరుకు గదు లతో ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. నిజామాబాద్ నగరం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఇక్కడి నాయకులు దొడ్డుగా, బలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఏమీ లేదంటూ విమర్శించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఒక్క పార్క్ లేదు. ఉన్న తిలక్‌గార్డెన్‌లో భవనాలు కట్టేశారన్నారు. నగరంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. జిల్లాలోను బీడీ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడవ నెల నుంచే ప్రతి ఒక్కరికి ప్రతి నెల రూ. 1,000 భృతి అందిస్తామన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికుల కోసం బీడీ భవన్‌ను నిర్మిస్తామన్నారు. గతంలో ఇంటి రుణాలు తీసుకున్నవారికి మాఫీ చేస్తాం, తండాలను పంచాయతీలుగా మారుస్తాం, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చా రు. అలాగే వృద్ధులకు, వితంతువులకు రూ. 1,000 పింఛన్, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ అందిస్తామన్నారు. ఇందుకుగాను టీఆర్ఎస్కు శాసన సభా స్థానాలతో పాటు, 16 ఎంపీ సీట్లు అందించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు రక్షణ కవచం, స్వీయరక్షణ అవసరమని మేధావులు, కార్మికులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు అందరు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. సకల జనుల సమ్మెకు ఎలా పూర్తి మద్దతు ఇచ్చారో అలాగే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి తమను గెలిపించాలని కోరారు.