వివరాలు తెలుసుకుంటున్న మంత్రి శ్రీనివాసులు
తుమ్మపాల (అనకాపల్లి): జిల్లాలో వుడా పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో 276 గ్రామాల ప్రజలకు పట్టణ గృహ లబ్ధిదారులతో సమానంగా రూ.2.50 లక్షలు గృహనిర్మాణానికి మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖామంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మండలంలో శంకరం గ్రామంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప గృహసముదాయాన్ని మంగళవారం ఆయన ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. గృహనిర్మాణానికి రూ.1.60 లక్షలు బ్యాంకు రుణం మంజూరు చేయగా, ముందుగా 10వేలు బ్యాంకులో డిపాజిట్ చేశామని, మిగిలిన రూ.1.50 లక్షలు బ్యాంకు రుణం కట్టాల్సిందిగా బ్యాంకర్లు నోటీసులు కూడా జారీ చేశారన్నారు.
గృహాలు అందివ్వకుండా రుణాలు ఎలా కట్టగలమని రుణ మొత్తం ప్రభుత్వమే భరించి గృహాలు మంజూరు చేయ్యాలని లబ్ధిదారులు కోరారు. మంత్రి మాట్లాడుతూ సుమారు పదెకరాల ప్రభు త్వ భూమిలో 13 ఏళ్లుగా అర్ధంతరంగా నిలిచిపోయిన గృహాలకు 9 కోట్లు వెచ్చించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రుణం అంశం తన పరిధిలో లేనందున, రూ.1.83 లక్షలు హడ్కో నిధులపై ముఖ్యమంత్రితో చర్చించి నెలరోజుల్లో లబ్ధిదారులకు మంచి వార్త అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సత్యనారాయణపురం మేగా లే అవుట్‌కు సమీపంలో నిర్మిస్తున్న టిడ్కో భవన నిర్మాణాలను పరిశీ లించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ కార్పొరేషన్ ఎస్‌ఈ ప్రసాధ్, డిఈ జి.వి.రమేష్, డీఎస్‌పి వెంకటరమణ, తహసీల్దార్లు సత్యనారాయణ, జ్ఞానవేణి, పట్టణ సీఐ మురళి, హౌసింగ్ డిఈ ధనుంజయరావు, ఆర్‌డబ్లు్యఎస్ డిఈ ప్రసాధ్, రూరల్ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment