వివిధ దేవతా గాయత్రీ మంత్ర సంకలనం
సాధారణంగా గాయత్రీ మంత్రమనగానే అందరూ ‘ఓం భూర్భువస్సువః...’ అనే మంత్రాన్నే మననం చేసుకుంటారు. అయితే ప్రతి దేవతకీ ఓ గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రిని ఉపాసించడం వల్ల సత్వర ఫలం లభిస్తుంది. ఉదాహరణకు బ్రహ్మ గాయత్రి, విష్ణుగాయత్రి, మహాలక్ష్మీ గాయత్రి, వేంకటేశ గాయత్రి... ఇలాగన్నమాట. సాధకులు ఆయా గాయత్రులను ఉపాసించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని పెద్దలు చెబుతారు.
అయితే అవన్నీ ఒకేచోట ఉండవు. ఎక్కడో ఒకటీ అరా మాత్రమే లభిస్తాయి. శ్రీ వాల్మీకి రామాయణమనే వచనకావ్యాన్ని, శ్రీ దత్తసాయి చరితామృతమనే గ్రంథాన్నీ రచించిన తంగిరాల శ్రీధర శర్మ గాయత్రీ మంత్రం పట్ల అనురక్తితో మరికొందరు పెద్దలు, పండితుల సహకారంతో వివిధ దేవతలకు సంబంధించిన 660 పైచిలుకు గాయత్రీ మంత్రాలను సేకరించారు. వాట న్నింటిని ఒక చోట కూర్చి, ‘వివిధ గాయత్రీ దేవతా మంత్రములు’ అనే పుస్తక రూపాన్నిచ్చారు. ఇందులో శ్రీ గాయత్రీ మంత్ర మహాత్మ్యాన్ని ముందుమాటగానూ, శ్రీ సూక్తం, దుర్గాసూక్తం, మన్యుసూక్తం తదితరాలను అనుబంధాలగానూ అందించి, పుస్తక విలువను, పఠనీయతను పెంపొందించారు.
శ్రీ గాయత్రీ మంత్ర మహాత్మ్య సహిత
వివిధ దేవతా గాయత్రీ మంత్రములు
పుటలు: 256; వెల రూ. 150,
ప్రతులకు: తంగిరాల శ్రీధర శర్మ,
ఫ్లాట్ నం. 101, వేదప్రణతి, 6-3-609/165, ఆనందనగర్,
హైదరాబాద్- 500 004.
మెయిల్ ఐడీ: sthangirala@gmail.com
- డి.వి.ఆర్.